ముంబయి, అభి మీడియా సొల్యూషన్స్ ప్రతినిధి : ఎన్సీపీ నేత అజిత్ పవార్ వల్ల
మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో ఎన్సీపీ పార్టీ అధినేత శరద్
పవార్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఎన్సీపీ వ్యవస్థాపకుడు, రాజకీయ
కురువృద్ధుడు శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా
చేస్తున్నట్లు ప్రకటించారు. ముంబయిలో జరిగిన తన ఆత్మకథ పుస్తకావిష్కరణ
కార్యక్రమంలో పవార్ ఈ ప్రకటన చేశారు. ఈ నిర్ణయాన్ని ఎన్సీపీ కార్యకర్తలు
తీవ్రంగా నిరసించారు. మరికొంత మంది అయితే కన్నీరు పెట్టుకున్నారు. తన సమీప
బంధువు అజిత్ పవార్ ఎన్సీపీని వీడి బీజేపీలో చేరతారనే ఊహాగానాల మధ్య పవార్
ఈ నిర్ణయాన్ని వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తదుపరి పార్టీ
బాస్ ఎవరనే దానిపై స్పష్టత లేదు. ఆ వివరాలు తెలియాల్సి ఉంది. మహారాష్ట్రలో
మునుపటి సంకీర్ణ ప్రభుత్వంలో భిన్న సిద్దాంతాలు కలిగిన పార్టీలను ఒక దగ్గరకు
చేర్చిన ఘనత పవార్‌దే. ఆయన చొరవ వల్లే కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి
అధికారాన్ని పంచుకున్నాయి. అయితే శివసేనలో చీలిక రావడంతో ఆ కూటమి ప్రభుత్వం
కూలిపోయింది. అయినప్పటికీ ఆ పార్టీలు మాత్రం ఇప్పటికీ ఒక్కటిగానే ఉన్నాయి.