బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి
విజయవాడ : కర్ణాటక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో పర్యటించాలని, అభివృద్ధి
పనులను ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బెంగులూరులో నేరుగా కలసి
కోరడం జరిగిందని ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. కర్ణాటక
ఎన్నికల్లో కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏన్నికల
పర్యటన వ్యవహారాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నానని, ఈ సందర్భంగా కర్ణాటకలో
ప్రచారం చేస్తున్న ప్రధాని మోడీతో ఓ నిమిషం పాటు మాట్లాడటం జరిగిందని ఆయన
తెలిపారు.మోడీ గారికి మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ శుభాకాంక్షాలను తెలియచేశానని,
అలాగే ఏపీలో కేంద్ర ప్రభుత్వం నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు
జరుగుతున్నాయని, సంక్షేమ పథకాలు కూడా కేంద్ర నిధులతో రాష్ట్రంలో చాలా వరకు
అమలవుతున్నందున ఏపీలో పర్యటించాలని విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. అభివృద్ధి
పనుల ప్రారంభోత్సవాలు, అలాగే బహిరంగసభలోనూ పాల్గొని ప్రసంగించాలని విజ్ఞప్తి
చేశానని, మోడీకి ఏపీలో జరుగుతున్న అన్ని విషయాలపై స్పష్టమైన అవగాహన ఉన్నదని
ఆయన స్పందన ద్వారా అర్థం చేసుకున్నాని తెలిపారు.
కర్ణాటక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ సభలకు విశేషమైన స్పందన వచ్చిందని,
ఎక్కడ చూసినా మోడీ , మోడీ అనే నామస్మరణే వినిపించిందన్నారు. ప్రధాని మోడీ
సభల కోసం ప్రత్యేకంగా విధులు నిర్వహించడం నా అదృష్టంగా భావిస్తున్నానని,
ఖచ్చితంగా కర్నాటకలో బీజేపి ప్రభుత్వం తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం
చేశారు. క్షణం తీరిక లేకపోయినా ప్రధాని ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ఒక
శ్రద్ధతో ఆధ్యాత్మికమైన పనిలాగా ఎన్నికల ప్రచారం చేయడం చూసి యువ నేతలు ఎంతో
స్ఫూర్తి పొందుతారున్నారు. కర్ణాటక ఎన్నికల్లో పని చేస్తున్న నేతంలందరికీ
మోడీ పర్యటన, పార్టీ పని ఓ పాఠం లాంటిదని, ప్రజలకు ఎలా భరోసా ఇవ్వాలో, చేసిన
అభివృద్ధి వివరించి ప్రజల నమ్మకాన్ని ఎలా చూరగొనాలనేది మోడీ నుంచి ఎంత
నేర్చుకున్నా ఇంకా మిగిలే ఉంటుందన్నారు. కర్ణాటకలో మళ్లీ కమల వికాసం
ఉంటుందన్న నమ్మకాన్ని వారి సభలకు వస్తున్న స్పందనతో ప్రధాని మరింత పెంచారని
ఆయన తెలిపారు.