సుమారు 10 లక్షల వరకు ఉన్న కొత్త ఓటర్లు ఈ ఎన్నికల్లో కీలకం
బెంగళూరులోనే సుమారు 1.35లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నట్లు అంచనా
‘యువ మాత’ కార్యక్రమం ద్వారా జనంలోకి కాంగ్రెస్
అభివృద్ధే అస్త్రంగా బీజేపీ ముందుకు
బెంగుళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కొత్తగా సుమారు 10లక్షల మంది
నవ ఓటర్లు పాల్గొననున్నారు. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వీరిని తమవైపు
తిప్పుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.
కన్నడనాట అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అన్ని వర్గాల ఓటర్లను
ఆకర్షించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే
సుమారు 10 లక్షల వరకు ఉన్న కొత్త ఓటర్లు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు. ఈ
నేపథ్యంలోనే తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న యువతపై రాజకీయ పార్టీలు
దృష్టి సారించాయి. అభివృద్ధి కార్యక్రమాలపై అధికార పార్టీ బీజేపీ ఆధారపడగా
అటు ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ లు మాత్రం నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి
అంశాలను ఎత్తిచూపుతూ యువతకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి.
9 లక్షలకుపైగా తొలిసారి : కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో
కొత్తగా ఓటు హక్కు పొందిన వారి సంఖ్య 9.17 లక్షలు. వీరంతా 2018-19 నుంచి
కొత్తగా నమోదు చేసుకున్నవారు. సాధారణంగా వీరికి ఏ పార్టీతోనూ సంబంధం ఉండదు.
కేవలం ప్రస్తుత సమస్యల ఆధారంగానే ఓటు వేస్తారని రాజకీయ విశ్లేషకుల అంచనా.
దీంతో అన్ని వర్గాల మాదిరిగానే యువ ఓటర్లు ఎంతో కీలకమని చెబుతుంటారు. గత మూడు
ఎన్నికల్లోనూ వీరి ప్రభావం కొంతమేర కనిపించిందని సర్వేలు పేర్కొన్నాయి.
బెంగళూరులో 1.35లక్షల మంది : రాజధాని బెంగళూరులోనే సుమారు 1.35లక్షల మంది
కొత్త ఓటర్లు ఉన్నట్లు అంచనా. వీరందరి వయసు 20 లోపేనని బృహత్ బెంగళూరు మహానగర
పాలిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం యువత ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో
క్రియాశీలకంగా ఉంటుండటంతో రాజకీయ పార్టీలు వారినే టార్గెట్ చేస్తూ ప్రకటనలు
చేస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు, వారి ప్రొఫైళ్లను
తెలియజేస్తున్నాయి. ఇదే సమయంలో యువత కూడా కాలేజీ క్యాంటీన్లు మొదలు స్నేహితులు
కలిసిన చోట రాజకీయాలపై చర్చ జరుపుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా విద్య,
ఉపాధిపైనే వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ యువమాత : ‘యువ మాత’ కార్యక్రమం ద్వారా యువత సమస్యలను
ఎత్తిచూపుతున్న కర్ణాటక కాంగ్రెస్ అన్ని జిల్లాల్లో యువత సమస్యలపై సర్వేలు
నిర్వహించామని పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత యువత కోసం ప్రత్యేక
కార్యక్రమాలను రూపొందిస్తామని హామీలు ఇస్తోంది. యువనిధి పథకం ద్వారా నిరుద్యోగ
యువతకు రూ.3 వేల స్టైఫండ్ గ్యారంటీని ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ
క్రమంలో కొత్త ఓటర్లకు చేరువయ్యే బాధ్యతను యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి
ఎంఎస్ రక్షారామయ్యకు అప్పజెప్పింది.
అభివృద్ధే అస్త్రంగా బీజేపీ : బీజేపీ కూడా యువ ఓటర్లను ఆకర్షించేందుకు ముమ్మర
ప్రయత్నాలు చేస్తోంది. అధికార బీజేపీ తన యువజన విభాగంతో కలిసి ‘మీట్ అండ్
గ్రీట్’ కార్యక్రమాలతో వారికి చేరువయ్యేందుకు కృషి చేస్తోంది. ముఖ్యంగా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపడుతోన్న అనేక పథకాలను యువతలో ప్రచారం
చేస్తోంది. యువ సంవాద పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు
చేపడుతోంది. స్థానిక ఎంపీలు పీసీ మోహన్, తేజస్వీ సూర్యలు మీట్ అండ్ గ్రీట్
కార్యక్రమం నిర్వహించారు. ప్రజలతో నేరుగా చిట్‌చాట్ చేస్తూ ప్రభుత్వ
కార్యక్రమాలను వివరించారు.
యువ జనతాదళ్ : జేడీఎస్ యువజన విభాగమైన కర్ణాటక యువ జనతాదళ్ కూడా కొత్త
ఓటర్లకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మాజీ సీఎం హెచ్డీ కుమార స్వామి
కుమారుడు నిఖిల్ వివిధ జిల్లాల్లో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. బైక్
ర్యాలీలు ఏర్పాటు చేస్తూ నిరుద్యోగం, యువ రైతుల వంటి సమస్యలను
ప్రస్తావిస్తున్నారు. జిల్లా స్థాయిలో యువతకు చేరువయ్యేందుకు సామాజిక
మాధ్యమాల్లోనూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలా కర్ణాటకలో తొలిసారి ఓటు హక్కు
వినియోగించుకునేందుకు ఆసక్తిగా ఉన్న నవ ఓటర్లను ఆకర్శించేందుకు ప్రధాన
పార్టీలు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.