ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేయాలి
అధికారులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు
కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు,
సీహెచ్సీలలో నాడు – నేడు పనులపై సీఎం సమీక్ష
అమరావతి : వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం
సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ
సమావేశంలో సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న
రిక్రూట్మెంట్ బోర్డు వెంటనే వాటికి సంబంధించిన ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు
తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా కూడా సిబ్బంది లేరనే
మాట రాకూడదని తెలిపారు. సీఎం జగన్ మాట్లాడుతూ క్రమం తప్పకుండా ప్రభుత్వ
ఆస్పత్రుల్లో ఆడిట్ చేయాలని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, మందులు కూడా
సరిపడా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల దాదాపుగా సమస్యలు సమసిపోతాయని తెలిపారు.
ప్రతి సమీక్షా సమావేశంలో కూడా సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఎన్ని ఖాళీలు
ఉన్నాయన్న దానిపై వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ తాజా
పరిస్థితులపై సీఎంకు వివరాలను అధికారులు వివరించారు.
రాష్ట్రంలో కోవిడ్ పూర్తిగా అదుపులో ఉందని, గత వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా
నమోదైన కేసుల్లో ఏపీ 23 స్థానంలో ఉందని, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి
సంఖ్య కేవలం 24 మంది మాత్రమేనని, వీరంతా కోలుకుంటున్నారని అధికారులు
వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే
నిర్వహించామని, చాలా స్వల్ప సంఖ్యలో లక్షణాలు ఉన్నవారిని గుర్తించామని,
లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నామని అధికారులు
వెల్లడించారు. ప్రతి వైయస్సార్ క్లినిక్‌లో కూడా 20 ర్యాపిడ్ టెస్ట్
కిట్లను ఉంచామని, .14 ఆర్టీపీసీఆర్ ల్యాబులు పనిచేస్తున్నాయని,
ఎయిర్‌పోర్టులలో విదేశాల నుంచి వచ్చేవారికి టెస్టులు చేస్తున్నామని అధికారులు
తెలిపారు. ఆక్సిజన్ యూనిట్లు, పైపులైన్లు, మాస్క్‌లు, మందులు, పీపీఈ కిట్లు
ఇవన్నీ కూడా సరిపడా ఉన్నాయని వివరించారు.
ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేయాలి : ఫ్యామిలీ
డాక్టర్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఏప్రిల్
6 నుంచి 28 వరకూ 20,25,903 మందికి సేవలు. 10,032 గ్రామాల్లో వైద్య సేవలు
అందించిన ఫ్యామిలీ డాక్టర్. ఫ్యామిలీ డాక్టర్ వచ్చేముందు ఎప్పుడు
వస్తున్నారన్న దానిపై ముందుగానే తేదీలు ఇవ్వాలి. ఆ తేదీలను ఆశా కార్యకర్తలు,
ఏఎన్ఎంల ద్వారా గ్రామాల్లో ప్రజలకు తెలిపేలా చేయాలి. దీనివల్ల వారు ఫ్యామిలీ
డాక్టర్ వద్దకు వచ్చి వైద్యం పొందుతారు. అలాగే క్రమం తప్పకుండా కంటి పరీక్షలు
చేయాలి. ఎవరికి సమస్య ఉన్నా వారికి వెంటనే పరీక్షలు చేయించాలి. అవసరమైన వారికి
కంటి అద్దాలు ఇవ్వాలి. సీహెచ్సీలలో వారికిచ్చిన వైద్య పరికరాలను
వినియోగిస్తున్నారా ? లేదా ? అన్నది సమీక్ష చేయాలి.అందుబాటులోని
బోధనాసుపత్రుల్లో వారికి శిక్షణ ఇప్పించాలని సీఎం ఆదేశించారు.
నాడు – నేడు పనులపై సీఎం సమీక్ష : కొత్త మెడికల్ కాలేజీల కారణంగా 2100
ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయని, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 2185
మెడికల్ సీట్లకు ఇవి అదనం అని అధికారులు తెలిపారు. ఈ విద్యాసంవత్సంలో
విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో తరగతులు
ప్రారంభిస్తున్నామని, తద్వారా 750 సీట్లు అందుబాటులోకి రానున్నాయని, 2024 –25
విద్యా సంవత్సరంలో మరో 350 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని
అధికారులు సీఎంకు వివరించారు.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ
కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఆరోగ్య, కుటుంబ
సంక్షేమశాఖ డైరెక్టర్ జె నివాస్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్ హరీందిర ప్రసాద్,
ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్ రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్
ఎస్ వెంకటేశ్వర్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ డీఎస్విఎల్ నరసింహం,
డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ వి రామిరెడ్డి, డైరెక్టర్ (టెక్నికల్) నాడు నేడు ఆర్
మనోహర రెడ్డి, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ బి చంద్రశేఖర్ రెడ్డి ఇతర
ఉన్నతాధికారులు హాజరయ్యారు.