బెంగళూరు : కర్ణాటక శాసనసభ ఎన్నికలు కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా మరో
ఏడాదిలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు దిశా నిర్దేశం కానున్నాయి. దక్షిణ భారతదేశంలో
కాంగ్రెస్, బీజేపీలకు అనుకూలంగా ఉన్న ఏకైక రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు
రెండు పార్టీలు భారీగా కసరత్తు చేస్తున్నాయి. మరో తొమ్మిది రోజుల్లో పోలింగ్
జరగనుండగా ఓవైపు సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. కర్ణాటకలో మరోసారి హంగ్
ఏర్పడనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో అధికార బీజేపీ
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు ఒక్కో సర్వే ఒక్కోరకంగా అధికారం మీదే అంటూ
వెల్లడిస్తున్నాయి. మరికొన్ని సర్వేలు జేడీఎస్ పార్టీకి 25 సీట్లకుపైగా
వస్తాయని చెబుతున్నాయి. ఒకవేళ జేడీఎస్‌కు 25 సీట్లు వస్తే 2018 నాటి పరిస్థితే
పునరావృతం అవుతుంది. రాష్ట్రంలో 224 నియోజకవర్గాలు ఉండగా 2018లో బీజేపీకి వంద
సీట్లు వచ్చినా అధికారం చేపట్టలేకపోయింది. చివరి క్షణంలో కాంగ్రెస్, జేడీఎస్
కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌కు
100కుపైగా సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. మరికొన్ని సర్వేలు బీజేపీకి
90-100 దాకా వస్తాయని అంచనా వేస్తున్నాయి. ఇవే ఫలితాలు వస్తే 25కుపైగా సీట్లతో
జేడీఎస్ మరోసారి కింగ్‌మేకర్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. 2018 సంకీర్ణ
ప్రభుత్వంలో అవమానాలు ఎదుర్కొన్నామని జేడీఎస్ నేత కుమారస్వామి ఎన్నో
సందర్భాల్లో వాపోయారు. కాంగ్రెస్ వారే తమ గడప తొక్కి బేషరతుగా మద్దతు
ఇస్తామంటూ ఏడాదిన్నరలోనే ప్రభుత్వాన్ని కూల్చారని మండిపడ్డారు.