మీకు మంచి జరిగితే ఆశీర్వదించండి అని అడిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
చంటి బిడ్డ నుండి వృద్ధుల వరకు సంక్షేమ పథకాల అమలు
ఈదగాలిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి గోవర్ధన్ రెడ్డి
నెల్లూరు : పేద ప్రజలకు ఉదారంగా మేలు చేయాలనే ఆలోచన, దృడ సంకల్పంతో అసాధారణ
నిర్ణయాలతో, గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పాలన పరుగులు
పెట్టిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని రాష్ట్ర వ్యవసాయ
శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం
సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, ఈదగాలి గ్రామంలో రెండో రోజు
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కాకాణి గోవర్ధన్
రెడ్డికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రి మీడియాతో
మాట్లాడుతూ దేశంలోనే అత్యధికంగా 2750 రూపాయలు పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం
మనదేనని, చంటి బిడ్డ నుండి వృద్ధుల వరకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అసాధ్యం
అనుకున్న వాటిని సుసాధ్యం చేస్తూ ప్రజలకు ముఖ్యమంత్రి అండగా
నిలుస్తున్నారన్నారు. గతంలో ఎవరూ కూడా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయలేదని,
అసాధారణ నిర్ణయాలతో సంక్షేమ పాలనకు ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారన్నారు.
అలాగే సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నారని, చుక్కల
భూముల సమస్యను పరిష్కరించామన్నారు. ఈ గ్రామంలో 206 ఎకరాల చుక్కల భూములను 223
మంది రైతులకు హక్కు కల్పించామని, గ్రామస్తుల కోరిక మేరకు ఈదగాలి హరిజనవాడలో
టిటిడి ఆధ్వర్యంలో దేవాలయాన్ని నిర్మిస్తామని చెప్పారు.
మంత్రి వెంట ఎంపిడిఓ సుస్మిత, వైఎస్సార్సీపీ నాయకులు వేమారెడ్డి శ్యామ్
సుందర్ రెడ్డి, రఘునందన రెడ్డి, శేషయ్య, సంపత్ కుమార్ రెడ్డి, శ్రావణ్
రెడ్డి, రవి కుమార్, వివిధ శాఖల మండల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.