విజయవాడ : రాష్ట్రంలో జరుగుతూన్న అభివృద్ధి కళ్ళకు కనపడకుండా అడ్డుపడే
దురదృష్ట ప్రయత్నాలను సమర్ధవంతంగా తిప్పి కొట్టాలని ఆంద్ర ప్రదేశ్ సి.ఆర్.
మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు పిలుపు నిచ్చారు. జర్నలిస్టు
ఆంగ్ల మాస పత్రిక సంపాదకులు వి.వి.ఆర్ కృష్ణం రాజు రూపొందించిన “దేశ ప్రగతి
లోఆంధ్ర ప్రదేశ్ పాత్ర సర్వే నివేదిక విడుదల” సందర్భంగా స్థానిక సి.ఆర్.
మీడియా అకాడమీ కార్యాలయం ఏర్పాటైన సదస్సు కు ఆయన అధ్యక్షత వహించారు. ఈ
సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పక్షాలు, పత్రికలు తమ
రాజకీయ, పత్రికా ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని ప్రజల కళ్ళకు గంతలు
కట్టే ప్రయత్నం చేస్తూన్నారని ఆయన అన్నారు. అయితే, ప్రజల మనోభావాలతో పాటు
రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందన్న సంగతిని ఈ వర్గాలు పూర్తిగా పక్కన పెట్టేయడం
విచారించ దగ్గ అంశమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
పలు సందర్భాల్లో వెలువరించిన అధికారిక సమాచారం సేకరించి, దాన్ని ఒక క్రమ
పద్దతిలో ఉంచి ఆంద్ర ప్రదేశ్ వృద్ధి రేటును కళ్లముందుంచే ప్రయంత్నం చేసిన
వి.వి.ఆర్ కృష్ణం రాజు అభినందనీయులని ఆయన అన్నారు. రాష్ట్రంలో కోవిద్
పరిస్థితుల్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నామంటే 6 ,వేల పై చిలుకు ఆసుపత్రులు, 86
వేల పై చిలుకు ఆసుపత్రి పడకలు ప్రభుత్వ రంగం లోనే ఉండడం కారణమన్నారు.
జర్నలిస్టు ఆంగ్ల మాస పత్రిక సంపాదకులు వి.వి.ఆర్ కృష్ణం రాజు మాట్లాడుతూ
తాము సమీకరించిన గణాంకాలన్నీ నీతి ఆయోగ్, భారతీయ రిజర్వు బ్యాంక్, వివిధ
రాష్ట్రాలు విడుదలచేసిన సామాజిక ఆర్ధిక సర్వేల నుంచి సేకరించినవే అన్నారు.
వాస్తవాలను ప్రజలకు వివరించాలనే తలంపు తోనే ఈ నివేదిక రూపొందించామని, ఇందులో
ప్రత్యేకించి మరే ఉద్దేశ్యం లేదని ఆయన వివరించారు. స్థూల జాతీయ వృద్ధి రేటు
16.25 శాతం తో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం దేశం లోనే అగ్రగామి రాష్ట్రం గా వుందని
ఆయన పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంలో 25. 58 శాతం, వృద్ధి రేటు ఉందన్నారు.
2020-21 సంవత్సరంలో రాష్ట్రంలో 16,924 పరిశ్రమలున్నాయని ఆయన పేర్కొన్నారు.
దేశం లోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంద్ర ప్రదేశ్ వృద్ధి రేటు ఎక్కువగా
ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పై దుష్ప్రచారం జరుగుతుండడాన్ని అందరూ
ఖండించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల 10వేల కోట్లు వివిధ లబ్ధిదారుల
ఖాతాల్లోకి నేరుగా జమ చేసిందని, ఇలా వెళ్లిన నగదు పదే పదే సర్క్యూలేట్ అయ్యి
సమాజం లోని సేవారంగం, నిర్మాణ రంగంలో వృద్ధికి కారణమైందన్నారు. దేశంలోని మరే
ఇతర రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ప్రత్యక్ష నగదు బదలీ జరగలేదని ఆయన అన్నారు.
లఖంరాజు సునీత మాట్లాడుతూ జగన్ మోహనరెడ్డి పాలనలో మొదటి 2 సంవత్సరాలు కరోనా
మహమ్మారి వల్ల ఆదాయం తగ్గినప్పటికీ సంక్షేమ కార్య క్రమాలకు ఆటంకం లేకుండా
కొనసాగించారని అన్నారు. విద్య, వైద్య రంగాల్లో ప్రభత్వం పెద్ద ఎత్తున ఖర్చు
చేస్తోందని ఆ ప్రయాజనాలు తక్షణమే కనిపించేవి కాదని అన్నారు. రామరాజు శ్రీనివాస
రాజు మాట్లాడుతూ గత నాలుగేళ్ల పాలన లో అద్భుత ప్రగతి కనిపిస్తోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పధకాలు కొనసాగిస్తామని అన్ని రాజకీయ పక్షాలు ప్రకటించుకోవడమే
ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. రాష్ట్ర స్వంత టాక్స్ లు విషయం లో దేశంలో మన
రాష్ట్రం 6 వ స్థానం లో ఉందన్నారు. జనవిజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు జంపా
కృష్ణ కిషోర్ మాట్లాడుతూ 45వేల 396 కోట్లు సామాజిక రంగం పై రాష్ట్ర ప్రభుత్వం
ఖర్చు చేస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమలు కొత్తవి రాకుండా సైతం
కొన్ని వర్గాలు పారిశ్రామిక వర్గాల వద్ద రాష్ట్ర పరిస్థితులను తప్పుగా
చిత్రీకరిస్తున్నారని, ఈ విషయం తమ పరిశీలనలో వెల్లడైందన్నారు.
ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఇ . శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన లో దేశం లోనే మన రాష్ట్రం 3 వ స్థానం లో
వుందని అన్నారు. పేదరిక నిర్మూలన లో గత ప్రభుత్వం తో పోల్చితే 60 పాయింట్లు
ఆధిక్యత తో ప్రస్తుతం 81 పాయింట్లకు చేరుకుందని ఆయన అన్నారు. మానవ వనరుల
అభివృద్ధి సరిగా జరిగితేనే జనాభా పెరుగుదల రాష్ట్రానికి, దేశానికి మేలు
చేస్తుందని ఆయన అన్నారు.
హై కోర్టు న్యాయవాది అశోక్ కుమార్ మాట్లాడుతూ వివిధ పత్రికలు, పార్టీలు
ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు వాస్తవాలు
గమనిస్తున్నారన్నారు. రాష్ట్రం లోని వాలంటీర్ల వ్యవస్థ పై అధ్యయనానికి
బెంగాల్, మహారాష్ట్ర బృందాలు పర్యటించాయన్నారు.
లాంప్ ఎన్ జి ఓ అధినేత సాల్మన్ మాట్లాడుతూ రాష్ట్రం లో సంస్కరణలతో కూడిన
అభివృద్ధి జరుగుతోందన్నారు. ఈ ఫలాలు పూర్తి స్థాయిలో ప్రజలు అందుకుంటారని ఆయన
అన్నారు. మీడియా అకాడెమీ సెక్రెటరీ ఎం. బాలగంగాధర తిలక్ మాట్లాడుతూ
విద్యారంగం లో నాడు-నేడు కార్యక్రమం గొప్ప విప్లవాత్మక మార్పులు
తెస్తోందన్నారు. విద్య, వైద్య రంగాల్లో ప్రభత్వాలు పెట్టె పెట్టుబడులు
సమాజాన్ని ముందుకు నడిపిస్తాయని అన్నారు. అధ్యాపక విభాగం, రాష్ట్ర అధ్యక్షులు
మాది రెడ్డి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రచారం లో వున్నా అసత్యాలు ప్రజలు
తిరస్కరిస్తున్నారన్నారు. సీనియర్ జర్నలిస్టు శ్రీ చందన మధు మాట్లాడుతూ
పత్రికలు చెప్పేవన్నీ వాస్తవాలు కాదన్నారు. రాజకీయ, కుల, మత ప్రాంతీయ
భేదాలకతీతంగా పత్రికలూ పనిచేయాలని ఆయన అన్నారు. జర్నలిస్టు ఆంగ్ల మాస పత్రిక
సంపాదకులు వి.వి.ఆర్ కృష్ణం రాజు ను ఈ సందర్భంగా ఆంద్ర ప్రదేశ్ సి.ఆర్.
మీడియా అకాడెమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు సన్మానించారు.