సూర్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ము (జీపీఎఫ్)
విషయంలో ప్రభుత్వం, కొంతమంది పెద్దలు చేస్తున్న ప్రచారం హాస్యాస్పదంగా
ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ము ముట్టుకునే హక్కు ఈ ప్రభుత్వానికి లేదని,
అది ప్రభుత్వ భిక్ష కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
సూర్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీపీఎఫ్ నిధుల విడుదల విషయంలో రాష్ట్ర
ప్రభుత్వం, కొంతమంది పెద్దలు చేస్తున్న ప్రచారం చూస్తుంటే హాస్యాస్పదంగా
ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సొమ్మును ముట్టుకునే హక్కు ఈ ప్రభుత్వానికి
లేదని, అది ప్రభుత్వ భిక్ష కాదని ఆయన గుర్తు చేశారు. జీపీఎఫ్ నిధులను విడుదల
చేసి, దానిని ఉద్యోగులకు తిరిగి చెల్లించి ఏదో మేలు చేసినట్టుగా ఎలా
చెప్పుకుంటారని ప్రశ్నించిన ఆయన అది ప్రభుత్వం అనుగ్రహం కాదు, దయ కాదు, భిక్ష
కాదు. అది తమ సొమ్ము, హక్కు, దానిని ముట్టుకునే హక్కు ఈ ప్రభుత్వానికి లేదంటూ
తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళ్తే ఈ ఏడాది మార్చి 12వ తేదీన జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్
సమావేశంలో ఏపీ జీఎల్ఐ క్లెయిమ్‌ల నిధులను ఆర్థిక శాఖ విడుదల చేసినట్లు
పేర్కొంది. ఉద్యోగుల జీపీఎఫ్ బిల్లులను క్లియర్ చేయడానికి ఆర్థిక శాఖ రూ.3 వేల
కోట్లను వెచ్చించిందని.. నెలాఖరు (మార్చి)లోపు చెల్లిస్తామని సమావేశంలో
రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. జీపీఎఫ్తోపాటు ఇతర పెండింగ్ బిల్లులను కూడా
పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో జీపీఎఫ్ నిధుల విడుదలపై
ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రచారంపై ఈరోజు ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర
అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు.