విజయవాడ : విద్యార్థి దశ నుంచి సామాజిక సేవా దృక్పథం పెంపొందించేందుకు వీలుగా
డిగ్రీ స్థాయిల్లో ఒక సంవత్సరం సామాజిక సేవ అంశాన్ని ఫీల్డ్ వర్క్ గా
నిర్ణయించాలని ఇందుకు యూనివర్సిటీలు వారి వారి సిలబస్ లను నవీకరించుకోవాలని
సి.ఆర్. మీడియా అకాడెమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు సూచించారు. స్థానిక
స్వర్ణా పాలస్ లో ‘యువ మిత్ర’, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర యువస్వరాల నిర్మాణం
పై యూనిసెఫ్, రాష్ట్ర స్థాయి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గురువారం
నిర్వహించిన సమావేశం లో ఆయన ప్రధానోపన్యాసం చేశారు. కౌమార దశ కు (10- 19
వయస్సు) కు చెందిన 40 లక్షల బాల బాలికల కు సంబంధి 5 వ జాతీయ కుటుంబ ఆరోగ్య
సర్వే లో పేర్కొన్న అనేక అంశాలపై ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి
ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుంచి పలు చర్యలు చేపట్టిన సంగతిని ఆయన ఈ సందర్భంగా
ప్రస్తావించారు. వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ పధకం ద్వారా కౌమార దశలో వున్న
బాలికలకు, బాలింతలకు, చిన్న పిల్లలకు పౌష్ఠికాహారం,అందించడం జరుగుతోందన్నారు.
ఇందుకోసం ప్రతి యేటా రాష్ట్ర ప్రభుత్వం 1,863 కోట్లు ఖర్చుచేస్తోందన్నారు. మన
రాష్ట్ర పిల్లల భవిత కు నైపుణ్యం తో కూడిన ఆధునిక విద్యను అందించి
అత్యంతనైపుణ్యం తో కూడిన యువ మానవ వనరులు కలిగిన ఏకైక రాష్ట్రంగా ముఖ్యమంత్రి
వై.ఎస్. జగన్ మోహన రెడ్డి తీర్చిదిద్దుతున్నారన్నారు. అందులో భాగంగా “నాడు-
నేడు” కార్యక్రమం ద్వారా పాఠశాలల ఆధునీకరణ పెద్దఎత్తున జరుగుతోందన్నారు.
పిల్లలకు సరైన వసతులు, త్రాగు నీరు, మరుగు దొడ్డి సదుపాయాలు, ఫర్నిచర్ వంటివి
సమకూరుస్తూ కార్పొరేట్ పాఠశాలల కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్న
విషయం అందరూ గమనించాలన్నారు. దేశం లోనే ఢిల్లీ రాష్ట్రం తర్వాత విద్యకు పెద్ద
ఎత్తున నిధులు ఖర్చు చేస్తోన్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అని ఆయన వివరించారు.
కౌమార బాల బాలికల సామాజిక ఆర్ధిక రక్షణ కోసం మహిళాభివృద్ధి,శిశుసంక్షేమ శాఖ ను
నోడల్ శాఖ గా విద్య,వైద్యం,కార్మిక, పోలీస్ శాఖల సమిష్టిగా పని
చేస్తున్నాయన్నారు. ఈ అంశాల్ని డిజిటల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా
లద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించి లబ్దిదారులైన పిల్లలకు, వారి తల్లి
దండ్రులకు తెలిసే లా చేసి, ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలు నూరు శాతం అందేలా
చూడాలని పిలుపు నిచ్చారు. ప్రతి అంశాన్ని ద్వేషంతో, కక్షతో విమర్శల పర్వంతో
ప్రజల్ని తప్పు దారి పట్టిస్తున్న మీడియా అభివృద్ధిని మాత్రం పట్టించుకోవడం
లేదని ఆయన విమర్శించారు. పెద్ద పేపర్లో వార్త వస్తేనే ప్రజలకు తెలుస్తుందన్న
రోజులు పోయాయి, సోషల్ మీడియా ద్వారా కూడా మనం మన టార్గెట్ గ్రూప్ ను చేరుకునే
వెసులుబాటు ఉందని ఆయన వివరించారు. యూనిసెఫ్ ప్రతినిధి ప్రసూన్ సేన్ మాట్లాడుతూ
కౌమార బాల బాలికల గ్రూప్ కు స్వచ్చంద సంస్థలు చేరువకావాలని సూచించారు.
ఇందుకోసం వారిని సమూహాలుగా ఏర్పాటు చేసి వారితో నిరంతరం కలిసి పని చేయాలని
సూచించారు. ఆంధ్ర ప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సభ్యులు డా. జె.
రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నిర్ణయించిన
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి
స్థానం లో వుందన్నారు. గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ ను సద్వినియోగించుకోవడం
ద్వారా స్వచ్ఛంద సంస్థలు కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో పొందవచ్చని ఆయన
అన్నారు. కౌమార బాల బాలికల కు సంబంధించి ప్రత్యేక విధాన నిర్ణయాలు ఉండాల్సిన
అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
స్వచ్ఛంద సంస్థ లను సమన్వయ పరిచి సమావేశానికి అధ్యక్షత వహించిన మహిత స్వచ్ఛంద
సంస్థ డైరెక్టర్ రమేష్ శేఖర రెడ్డి మాట్లాడుతూ కౌమార బాల బాలికల స్థితి గతులపై
5 వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లో పేర్కొన్న అనేక అంశాలపై స్వచ్ఛంద సంస్థలు
ద్రుష్టి పెట్టి, వారిని దోపిడీ నుంచి, లైంగిక దాడుల నుంచి రక్షించే దిశగా
చర్యలు చేపట్టాలని కోరారు. ఇందుకోసం వారిని యూత్ గ్రూపులుగా సమీకరించాలని
పిలుపునిచ్చారు. సమావేశం లో సి. ఆర్. మీడియా అకాడెమి సెక్రటరీ మామిడిపల్లి
బాలగంగాధర తిలక్, స్వచ్ఛంద సంస్థ ల ప్రతినిధులు రాంనివాస్, వి. పౌల్ రాజ్,
రాష్ట్రం నలుమూలలనుంచి వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.