విజయవాడ : ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ విజయవాడ చేరుకున్నారు. ఎన్టీఆర్
శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు అయన విచ్చేశారు. విజయవాడ
విమానాశ్రయంలో రజనీకాంత్‌కు నందమూరి బాలకృష్ణ స్వాగతం పలికారు. సాయంత్రం
పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ శతజయంతి అంకురార్పణ సభ జరగనుంది.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఎన్టీఆర్ చారిత్రక
ప్రసంగాల పుస్తకాలను ఆవిష్కరించనున్నారు.
బాలయ్యను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న రజనీకాంత్ : స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి
ఉత్సవాలు అంకురార్పణ సభలో పాల్గొనేందుకు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్
శుక్రవారం ఉదయం విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో
రజినీకాంత్‌కు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వాగతం పలికారు. బాలయ్యను
చూడగానే సూపర్‌స్టార్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఎలా ఉన్నారంటూ రజనీకాంత్,
బాలయ్య పరస్పరం పలకరించుకున్నారు. ఆపై ఒకే కారులో ఇరువురు నోవోటెల్‌కు
బయలుదేరి వెళ్లారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు వచ్చినందుకు రజనీకాంత్‌కు
బాలకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు. అన్నగారి కార్యక్రమానికి రాకుండా ఉండగలనా
అంటూ సూపర్‌స్టార్ వ్యాఖ్యానించారు. నోవోటెల్ హోటల్‌కు వెళ్లిన వెంటనే
రజినీకాంత్‌తో బాలయ్య కాసేపు సమావేశమయ్యారు.
ముగ్గురు కలిసి ఒకేసారి : ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన రజినీకాంత్‌ను
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి ఆహ్వానించారు. ఈరోజు సాయంత్రం
చంద్రబాబు ఇంటికి సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా
సూపర్‌స్టార్‌కు చంద్రబాబు తేనేటి విందు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి సూపర్ స్టార్ రజినీకాంత్, నందమూరి బాలకృష్ణ
రానున్నారు. సాయంత్రం ఐదు గంటలకు చంద్రబాబు, రజనీకాంత్, నందమూరి బాలకృష్ణ
ఒకేసారి ఉండవల్లి నివాసం నుంచి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సభ వద్దకు
వెళ్ళనున్నారు.
ఈరోజు సాయంత్రం పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సభ
జరుగనుంది. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలపై ఈరోజు రెండు పుస్తకాల విడుదల
చేయనున్నారు. ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్య పరుస్తూ
వివిధ వేదికల మీద చేసిన ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను విడుదల
చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్, టీడీపీ అధినేత
చంద్రబాబు నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. అలాగే
ఎన్టీఆర్‌పై తొలి పుస్తకం రాసిన సీనియర్ జర్నలిస్టు ఎస్. వెంకటనారాయణ సభలో
పాల్గొననున్నారు.