చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పలు పథకాల ద్వారా జీవనోపాధి
కల్పించే మార్గాలను విస్తృతం చేయాలి
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష
గుంటూరు : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో
సీఎం జగన్ ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, మహిళల స్వయం
సాధికారిత కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. చేయూత, ఆసరా, కాపు
నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పలు పథకాల ద్వారా వారికి జీవనోపాధి కల్పించే
మార్గాలను మరింత విస్తృతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. చేయూత కింద అర్హత
సాధించిన లబ్ధిదారులకు వరుసగా నాలుగేళ్లపాటు క్రమం తప్పకుండా ప్రభుత్వం ఆర్థిక
సహాయం అందిస్తోందని సీఎం అన్నారు. అలానే ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం
పథకాల కింద కూడా నిర్ణయించిన వ్యవధి మేరకు క్రమం తప్పకుండా వారికి ఆర్థిక
సహాయం అందుతుందని సీఎం అన్నారు. ఈ డబ్బు వారి జీవనోపాధికి ఉపయోగపడేలా ఇప్పటికే
ప్రభుత్వం బ్యాంకుల సహాయంతో స్వయం ఉపాధి మార్గాలను అమలు చేస్తోందని, దీన్ని
మరింత విస్తృతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
*లబ్ధిదారులకు పథకాన్ని అందుకునే మొదటి ఏడాదినుంచే వారిని స్వయం ఉపాధి
మార్గాలవైపు మళ్లించే కార్యక్రమాలను మరింత పెంచాలని, దీనివల్ల గ్రామ స్థాయిలో
సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా వేగంగా అడుగులుపడతాయని ముఖ్యమంత్రి అన్నారు.
అర్హులైన మహిళల్లో మరింత అవగాహన కల్పించి బ్యాంకుల నుంచి కూడా రుణాలు ఇప్పించి
ఉపాధి కల్పించే మార్గాలను సమర్థవంతంగా కొనసాగించాలని, మహిళలు తయారు చేస్తున్న
వస్తువులు, ఉత్పాదనలకు సంబంధించి మంచి మార్కెట్ వ్యవస్ధ ఉండాలన్నారు.
దీనికోసం బహుళజాతి కంపెనీలతో అనుసంధానం కావాలని సూచించారు. 45-60 సంవత్సరాల
వయస్సు మధ్యలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల సాధికారతే లక్ష్యంగా
చేయూత పథకం అని, ఇప్పటివరకూ చేయూత పథకం ద్వారా 9 లక్షలమంది స్వయం ఉపాధి
పొందుతున్నారని అధికారులు వెల్లడించారు.
హిందుస్తాన్ యూనీలీవర్, ఐటీసీ లిమిటెడ్, రిలయెన్స్, అజియో, జీవీకే, మహేంద్ర,
కాలాగుడి, ఇర్మా, నైనా, పీ అండ్ జీ వంటి అంతర్జాతీయ సంస్ధలతో ఇప్పటికే
ఒప్పందాలు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా చేయూత మహిళా
మార్టు, వస్త్ర, చింతపండు ప్రాసెసింగ్ యూనిట్, లేస్ పార్కు, ఇ– కామర్స్,
ఇ–మిర్చ, బ్యాక్ యార్డు పౌల్ట్రీ, ఆనియన్ సోలార్ డ్రయ్యర్లు ఏర్పాటు వంటి
కార్యక్రమాలను చేపడుతున్నట్టు అధికారులు వివరించారు.*
27 చేయూత మహిళా మార్టులు ఏర్పాటు : గ్రామీణ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను
మార్కెట్ ధర కంటే తక్కువకే అందించాలన్న లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల మహిళలతో
సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేశామని, జిల్లాకు కనీసం రెండు సూపర్ మార్కెట్లు
ఏర్పాటు చేయనున్నట్టు అధికారులుతెలిపారు. మొత్తం 27 చేయూత మహిళా మార్టులు
ఏర్పాటు చేసారని, ఒక్కో సూపర్ మార్టులో కనీసం నెలకు రూ.30 లక్షలు టర్నోవర్
లక్ష్యంగా ఏర్పాటు చేశామని, వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు డోర్ డెలివరీ,
ఆన్లైన్ బుకింగ్, వాట్సప్ బుకింగ్ సౌకర్యా్ని అందుబాటులోకి తెస్తున్నామని
అధికారులు వివరించారు. మల్టీ నేషన్ కంపెనీలతో భాగస్వామ్యం వల్ల వారి
ఉత్పత్తుల్లో కనీసం 8 నుంచి 25 శాతం మార్జిన్ ఉండేట్టు ఏర్పాటు చేశామని
వెల్లడించారు. కాకినాడ జిల్లాలో సామర్లకోటలో వస్త్ర పేరుతో ఏర్పాటు చేసిన
దుస్తుల తయారీ యూనిట్లో 200 మంది మహిళలకు ఉపాధి లభిస్తోందని, ట్రెండ్స్,
అజియో వంటి కంపెనీలతో ఒప్పందం జరిగిందన్నారు. చిత్తూరు జిల్లా కురుబలకోటలో
చింతపండు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశామని, ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు
3వేల కుటుంబాలకు చేయూత అందుతోందని తెలిపారు.
ఉపాధి హామీపైనా సమీక్ష : ఉపాథి హామీలో భాగంగా ఈ ఏడాది 1500 లక్షల పనిదినాలు
కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
ఇప్పటివరకూ 215.17 లక్షల పనిదినాల కల్పన జరిగిందని, పనిదినాల రూపంలో రూ. 5280
కోట్ల రూపాయలు ఉపాధిహామీ కింద ఖర్చు చేయాలని లక్ష్యంగ పెట్టుకున్నామని,
మెటీరియల్ రూపంలో రూ.3520 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని, మొత్తంగా ఈ ఆర్థిక
సంవత్సరంలో రూ.8800 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు
వివరించారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా
రావాల్సిన ఉపాథిహామీ డబ్బులు సుమారు రూ.880 కోట్లు రావాల్సి ఉందని అధికారులు
తెలిపారు. ఈ డబ్బులు తెచ్చుకోవడంపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని,
గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్కులు పూర్తిచేయాలని,
గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పైన కూడా దృష్టిపెట్టాలని సీఎం
ఆదేశించారు. రోడ్ల నాణ్యతపైనా మరింత దృష్టిపెట్టాలని, రోడ్డు వేస్తే కనీసం
ఐదేళ్లపాటు నిలిచేలా నాణ్యత పాటించాలని, వేసిన మరుసటి సంవత్సరమే మళ్లీ రిపేరు
చేయాల్సిన పరిస్థితి రాకూడదన్నారు. ఆ మేరకు అధికారులు అన్ని చర్యలూ
తీసుకోవాలని, ఇంజినీర్లు వీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం
ఆదేశించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ)
బూడి ముత్యాలనాయుడు, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ సూర్యకుమారి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ పి
బసంత్ కుమార్, సెర్ప్ సీఈఓ ఏ ఎండి ఇంతియాజ్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.