తిరుపతి : తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ప్రశస్థ్యం దేశమంతా తెలిసేలా అమ్మ
జాతరను వైభవంగా నిర్వహిద్దామని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి
ప్రజలనుద్దేశించి విజ్ఞప్తి చేసారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లిని
కొలుస్తూ, అమ్మ వైభవాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెల్లాలనే ఆలోచనలో భాగంగ
7 పాటలను తీసుకురావడం జరిగిందని ఆయన చెబుతూ 7 పాటలతో రూపొందించిన గంగ జాతర
స్వర కుంభాభిషేకం సిడిని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి గురువారం
స్థానిక భీమాస్ రెసిడెన్సీ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిరుపతి
నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్ ముద్ర
నారాయణ, గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కట్టా గోపీ యాదవ్, ఈవో మునికృష్ణలతో కలిసి
ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ దేశంలోనే మొట్ట మొదటి
గ్రామ దేవత దేవాలయం మన తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయమని,
తిరుపతి గంగమ్మ ఆలయం నుంచే జాన పద పండుగ భావస్పూర్తి దేశానికి
వ్యాపించిందన్నారు. రాయలసీమకే తిరుపతి గంగ జాతర తలమానికమని వివరిస్తూ గంగమ్మ
తల్లి ఆలయ ప్రాశస్థ్యం భారత జాతికి తెలియాలన్నారు. ఐదు వందల సంవత్సరాల కిందటి
నుంచే తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తన చెల్లి గంగమ్మకు సారె సమర్పించే
సంప్రదాయం కొనసాగుతున్నదని, గంగమ్మ దర్శనం తర్వాతే తిరుమల శ్రీవారిని
దర్శించుకునే విధానం గతంలో ఉండేదని ఆయన గుర్తు చేసారు. తిరుమల శీవారి దేవేరైన,
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే పంచమీతీర్థం
సందర్భంగా అమ్మ వారికి సమర్పించే పసుపు, కుంకుమలను గంగమ్మ తల్లి ఆలయం వద్ద
నుంచే తీసుకెళ్లే విధానమూ గతంలో ఉండేదన్నారు. తిరుపతి గంగమ్మ ఆశీస్సులు వల్లే
మన ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు లేవని, గడిచిన గత వెయ్యేళ్లలోనూ ఇక్కడ కలరా
అంటే ఎమిటో తెలియదని, ఇదంతా గంగమ్మ తల్లి కృపేనన్నారు. బ్రహ్మోత్సవాల తరహాలో
గంగ జాతరను వైభవంగా జరపాలన్నదే ఇక్కడి 4.5 లక్షల మంది కోరికని, గంగమ్మ
వైభవాన్ని దేశవ్యాప్తం చేయడంలో మీడియా సహకారం అవసరమని భూమన ఆకాంక్షించారు.
గంగమ్మ స్వర కుంభాభిషేకం ఆల్బమ్ రూపకల్పన వెనుక కమిషనర్ హరిత సోదరుడు కిషన్
కృషి ఉన్నదని, మంగ్లీ దగ్గర పాడించడమే కాకుండా అమ్మవారికి తన గొంతుతో ఓక పాట
పాడడం అమ్మవారి దయేనని చెబుతూ కిశన్, వారి బృందంలోని సంపత్, జశ్వంత్ లకు
ప్రత్యేక అభినందనలు ఎమ్మెల్యే భూమన తెలియజేసారు. ఈ కార్యక్రమంలో దొడ్డారెడ్డి
సిద్దారెడ్డి, పాలగిరి ప్రతాప్ రెడ్డి, కార్పొరేటర్లు రామస్వామి
వెంకటేశ్వర్లు, హనుమంత నాయక్, రుద్రరాజు శ్రీధేవి, దేవానంధ్, రాజేంధ్ర, కుమార్
తదితరులు పాల్గొన్నారు.