ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
విజయవాడ : విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన ‘‘జై భారత్ సత్యాగ్రహ’’
భారీ బహిరంగ సభ విజయవంతం అయిందని, కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అన్న వాళ్లకు
ఇది కనువిప్పు కావాలని ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. కర్ణాటక
అసెంబ్లీ ఎన్నికలలో మన తెలుగువారంతా కాంగ్రెస్ పార్టీ ని బలపరిచి హస్తం
గుర్తుకు ఓటేసి అధికారంలోకి తీసుకురావాలని అక్కడి తెలుగువారిని రుద్రరాజు
కోరారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో గిడుగు
రుద్రరాజు మాట్లాడుతూ 1921వ సం॥లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రదేశంలో సభ
నిర్వహించామని అన్నారు. అన్ని జిల్లాలలో సభలు నిర్వహిస్తామని, కర్ణాటక ఎన్నికల
తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సభ
ఏర్పాటుచేస్తామని, ఆ సభకు రాహుల్ గాంధీ హాజరవుతారని చెప్పారు. పార్టీ
బలోపేతానికి కృషి చేస్తున్నామని, పార్టీ కి పూర్వ వైభవం తీసుకువస్తామని ఆయన
ఘంటాపథంగా చెప్పారు. తెలుగువారి ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ 26 జిల్లాలలోనూ
కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు ఉందని, అందరిలో తిరిగి ఆత్మస్థైర్యాన్ని
నింపటానికి కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్సాహపరుస్తామని అన్నారు. కేంద్రం చేసిన
అన్యాయం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎటూ కాని పరిస్థితిలో ఉండిపోయిందని, ఇది చాలా
ప్రమాదమని, ప్రజలు చైతన్యవంతమయితేనే రాజకీయాలలో మార్పు వస్తుందని వివరించారు.
ఆంధ్రాలో బిజెపి అధికారంలోకి రాదు కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని అన్నారు.
ఆంధ్రా బ్యాంకు పేరు మార్చివేశారని విమర్శించారు. స్టేట్ బ్యాంకు ఆఫ్
హైదరాబాద్‌ను వేరే బ్యాంకులో కలిపేశారు. ఆంధ్ర ప్రజలపై ఇది కక్ష సాధింపు
చర్యగా రుద్రరాజు ఆరోపించారు. కర్నాటక ఎన్నికలకు సంబంధించి మాజీ మంత్రి, మాజీ
పిసిసి అధ్యక్షులు డా॥ఎన్.రఘువీరారెడ్డి కి బెంగుళూరు బాధ్యతలు అప్పగించారని
తెలిపారు. ఈ పత్రికా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లాం తాంతియా
కుమారి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు, ధనేకుల
మురళీమోహన్ రావు, కొమ్మినేని సురేష్ తదితరులు పాల్గొన్నారు.