గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, నవజాత శిశువుల సంరక్షణ కొరకు ప్రత్యేక
చర్యలు
మెరుగైన వైద్యం కోసం నూరా హెల్త్ సంస్థతో ఏపీ నేషనల్ హెల్త్ మిషన్ భాగస్వామ్య
ఒప్పందం
పేషెంట్ కుటుంబ సభ్యులకు, వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్న నూరా
హెల్త్, యునిసెఫ్
ప్రజలకు వద్దకే వైద్యం “ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ “ ప్రధాన లక్ష్యం
వైద్య ఆరోగ్యశాఖల్లో సిబ్బందిని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేలా పలు
కార్యక్రమాలు
రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు
విజయవాడ : దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో మాతా, శిశుమరణాల రేటు తక్కువగా
ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి
కృష్ణబాబు అన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ
కోసం నూరా హెల్త్ సంస్థ, యునిసెఫ్‌తో ఏపీ నేషనల్ హెల్త్ మిషన్ భాగస్వామ్య
ఒప్పందం చేసుకుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సామర్థ్యం పెంచేలా నూరా
హెల్త్, యునిసెఫ్ ఆధ్వర్యంలో “కేర్ క్యాంపెయిన్ ప్రోగ్రాం”పై నిర్వహించే
శిక్షణా తరగతులను ఆయన విజయవాడ లో బుధవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ.. మాతా, శిశుమరణాలలో దేశంలో తల్లుల
మరణాల రేటు 45శాతం ఉంటే.. రాష్ట్రంలో 35గా ఉందని, దేశంలో శిశుమరణాల రేటు
35శాతం ఉంటే రాష్ట్రంలో 30గా ఉందన్నారు. దేశంలో ప్రతీ పదివేల జనాభాకి పది
మంది డాక్టర్లు ఉండాలని డబ్ల్యూహెచ్ఓ నిబంధనలు ఉండగా ఏపీలో దాదాపు 19 మంది
వరకు ఉన్నారని, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో మానవ వనరులకి కొదవ లేదన్నారు.
గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, బీపీ, షుగర్, క్యాన్సర్ తదితర బాధితులకు
నాణ్యమైన వైద్యసేవలు అందిస్తూ వైద్య, ఆరోగ్య రంగ సంస్కరణల్లో దేశంలోనే
ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలుస్తోందన్నారు. గ్రామీణ పేద ప్రజలకు,
గ్రామాలను సందర్శించే ప్రభుత్వ వైద్య సిబ్బందికి మధ్య బంధాన్ని మరింత బలోపేతం
చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వంటి
విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్
రెడ్డి ఆలోచనల మేరకు వైద్య, ఆరోగ్య విధానంలో దేశంలోనే ఏపీ ఆదర్శంగా
నిలుస్తోందన్నారు. ఆస్పత్రుల్లో అత్యవసర కేసులతో పాటు గర్భిణీ స్త్రీలు,
బాలింతలు, నవజాత శిశువులకు చికిత్స అందించే విధానంలో కీలక మార్పు దిశగా నూరా
హెల్త్ కేర్ క్యాంపెయిన్ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. పేషెంట్ ఆరోగ్యవంతంగా
ఉండాలన్నా, త్వరగా కోలుకోవాలన్నా వారి బంధువులకు కూడా వైద్యంపై అవగాహన
ఉండాలన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతల విషయంలో వారి తల్లులు, భర్తలు, ఇతర
కుటుంబసభ్యులు కూడా తగిత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో
భాగంగా 10 వేల మందికిపైగా హెల్త్ అసిస్టెంట్లకి ప్రత్యేక శిక్షణ
ఇస్తున్నామన్నారు. వైద్య ఆరోగ్య అంశాల్లో 2030 నాటికి రాష్ట్రం ప్రథమ స్థానంలో
ఉండాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. మెటర్నిటీ వార్డులపై ప్రత్యేక దృష్టి
పెడుతున్నామని ఇందులో భాగంగా స్క్రీన్స్ ఏర్పాటు చేసి పాటించాల్సిన నియమాలు,
తీసుకోవల్సిన జాగ్రత్తలను డిస్ ప్లే చేయాలని ఆలోచన చేస్తున్నామన్నారు. సేవ్
లైఫ్ ఫౌండేషన్ స్టడీ చేసిన అంశాలను ప్రామాణికంగా చేసుకుని అత్యవసర కేసుల్లో
క్షేత్ర స్థాయి వైద్య సిబ్బందిలో అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమాలను
చేపడుతున్నామన్నారు. గర్భిణీకి అందించాల్సిన పౌష్టికాహారం, దీర్ఘ కాలిక
రోగాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రాథమిక చికిత్సతో పాటు తదితర అంశాలపై
కూడా స్టాఫ్ నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. ఫ్యామిలీ
డాక్టర్ విధానం ప్రారంభించిన తర్వాత ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య డేటా
డిజిటలైజ్ చేస్తున్నామన్నారు. రోగులతో వైద్య సిబ్బంది మసులుకునే విధానం వల్ల
కూడా వారి పరిస్థితుల్లో మార్పు తీసుకురావొచ్చని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
ఎమర్జెన్సీ కేసుల్లో చాలామంది స్థానిక ఆస్పత్రులపైనే ఆధారపడతారని, అందుకే
గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్యం అందించేలా వైద్య సిబ్బందికి శిక్షణ
ఉంటుందన్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం, ఎంఎల్ఎచ్పీ తదితర సిబ్బందికి వివిధ
వైద్య విధానాల్లో శిక్షణ ఇస్తారన్నారు. ఏపీలో మెరుగైన వైద్య సదుపాయాల ద్వారా
ముందస్తు రోగ నివారణ జరుగుతోందని, గ్రామ స్థాయిలోనే దాదాపు 80 శాతం రోగాలకి
చికిత్స అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత రెండేళ్లలో
రాష్ట్రంలో 48వేలకు పైగా వైద్య సిబ్బందిని నియమించామని.. ప్రభుత్వ
ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మరింత పెంచామన్నారు.
రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, స్టేట్ నేషనల్ హెల్త్ మిషన్
డైరెక్టర్ శ్రీ.జె.నివాస్ మాట్లాడుతూ.. తల్లీ, బిడ్డల సంరక్షణ కోసం రాష్ట్రంలో
వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి ముందుకు వచ్చిన నూరా హెల్త్ కి కృతజ్ణతలు
చెప్పారు. ఈ శిక్షణ ద్వారా తల్లీ, బిడ్డల సంరక్షణ, ఆరోగ్యంపై అవగాహన
కల్పిస్తామన్నారు. వైద్య సిబ్బందికి శిక్షణతో పాటు తల్లి, వారి కుటుంబసభ్యులకు
కూడా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. దీంతో ప్రతి బిడ్డ ఆరోగ్యంగా
పుట్టడంతో పాటు ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై
అవగాహన ఏర్పడుతుందన్నారు. మాతా, శిశుమరణాల్ని తగ్గించడమే నూరా హెల్త్ కేర్,
యునిసెఫ్ శిక్షణా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.
నూరా హెల్త్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ సీమా మూర్తి మాట్లాడుతూ వైద్య
ఆరోగ్యరంగంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.
తల్లీ, బిడ్డల సంరక్షణ కోసం రాష్ట్రంలో వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చే అవకాశం
నూరా హెల్త్ కి కల్పించినందుకు కృతజ్ణతలు చెప్పారు. రాష్ట్రంలో 10 వేల మందికి
పైగా ఎంహెల్హెచ్పీలు ఉండటం దేశంలో మరెక్కడా లేదని ఈ విషయంలో కూడా స్టేట్
ఫస్ట్ ప్లేస్‌లో ఉందన్నారు. యునిసెఫ్, హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్ సీమా కుమార్
మాట్లాడుతూ..నూరా హెల్త్ కేర్ క్యాంపెయిన్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కావడం
సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాలో యునిసెఫ్ సేవలు
అందిస్తోందని..ఇకపై కూడా మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తామన్నారు. కార్యక్రమంలో
అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ కె.వి.ఎన్.ఎస్. అనిల్ కుమార్, జాయింట్ డైరెక్టర్
డాక్టర్ కె.అర్జున్ రావు, డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ నిర్మలా గ్లోరీ, స్టాఫ్
నర్సులు, కౌన్సిలర్లు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.