అనంతపురం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 26న అనంతపురం
జిల్లాలో పర్యటించనున్నారు. శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో
నిర్వహించనున్న ‘జగనన్న వసతి దీవెన’ కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు
జమచేయనున్నారు. బుధవారం ఉదయం8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి
10.20 గంటలకు నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు సీఎం చేరుకుంటారు. 10.40 –
12.35 గంటల వరకు నార్పల క్రాస్‌రోడ్స్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో
పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగం, అనంతరం జగనన్న వసతి దీవెన కార్యక్రమం–
లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.10
గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
సీఎం పర్యటనపై కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ : ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి ఈ నెల 26న జిల్లా పర్యటనకు విస్తున్నారని కలెక్టర్ గౌతమి
తెలిపారు. సీఎం పర్యటనపై కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో
టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను
ఆదేశించారు. హెలిప్యాడ్ నుంచి సభాస్థలి వరకు బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు.
విద్యార్థులు, లబ్ధిదారులను సమావేశానికి బస్సుల్లో తీసుకురావాలని సూచించారు.
వాహనాలు నిలిపేందుకు ప్రజలకు, వీఐపీలకు వేరువేరుగా పార్కింగ్ ఏర్పాటు
చేయాలన్నారు. సభాస్థలి గ్యాలరీ వద్ద తాగునీరు, మజ్జిగ, స్నాక్స్ అందుబాటులో
ఉంచాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 104, 108
వాహనాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం అయ్యేలా
అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు.
వినతులు స్వీకరించాలి : ముఖ్యమంత్రికి సమస్యలు తెలుపుకొనేందుకు వచ్చే ప్రజల
నుంచి వినతులు స్వీకరించేందుకు తగినంత సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని
గుంతకల్లు ఆర్డీఓ రవీంద్రకు సూచించారు. ప్రజల నుంచి ముందస్తుగానే అర్జీలు
స్వీకరించి డీఆర్ఓకు అందజేయాలని ఆదేశించారు.
ఏర్పాట్ల పరిశీలన : సీఎం పర్యటనకు సంబంధించి నార్పలలో సభా ప్రాంగణం,
హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాల ఏర్పాట్లను సీఎం కార్యక్రమాల కో–ఆర్డినేటర్
తలశిల రఘురాం, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, ఎస్పీ
కంచి శ్రీనివాస్‌రావు, జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్, ఆర్డీఓ మధుసూదన్
పరిశీలించారు. వీరి వెంట ఆర్అండ్బీ అధికారి ఓబుల్‌రెడ్డి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ
డైరెక్టర్ రఘునాథ్‌రెడ్డి, అనంతపురం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నార్పల
సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ నాగేశ్వరావు, వైఎస్సార్సీపీ నాయకులు రఘునాథరెడ్డి,
సత్యనారాయణరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మిద్దె కుళ్లాయప్ప, సొసైటీ
చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి ఉన్నారు.