పులివెందుల : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ బృందం
మరోసారి పులివెందులలో వివేకా ఇంటిని పరిశీలించింది. కొత్తగా వచ్చిన సీబీఐ
సిట్ బృందం అధికారులు పులివెందులకు వెళ్లి వివేకా ఇంటిని పరిశీలించారు.
ఇంట్లో హత్య జరిగిన బాత్రూమ్, బెడ్ రూమ్ ప్రాంతాలను సీబీఐ అధికారులు
క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వివేకా ఇంటి నుంచి బయటకు వచ్చిన సీబీఐ
అధికారులు సమీపంలో ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటి వద్దకు వెళ్లారు. ఆయన ఇంటి
పరిసరాలను కూడా పరిశీలించారు. అవినాష్‌రెడ్డి ఇంటి వద్ద ఉన్న పీఏ రమణారెడ్డితో
సీబీఐ అధికారులు మాట్లాడారు.
అవినాష్ చెప్పిన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన : ఎంపీ అవినాష్‌రెడ్డి
ఆరోపణలపై కూడా సీబీఐ ఆరా తీస్తోంది. హత్య జరిగిన రోజు జమ్మలమడుగు వెళ్తుండగా
తనకు ఫోన్ వస్తే తిరిగి వచ్చానని అవినాష్‌రెడ్డి సీబీఐ అధికారులకు తెలిపారు.
అవినాష్ చెప్పిన సమాచారాన్ని సీబీఐ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అవినాష్ పీఏను పులివెందుల రింగ్ రోడ్డు వద్దకు తీసుకెళ్లారు. అవినాష్
చెప్పింది నిర్ధరణ చేసుకునేందుకు పీఏను తీసుకెళ్లినట్టు సమాచారం. ఎంత సమయంలో
వివేకా ఇంటికి అవినాష్ వచ్చారనే దానిపై ప్రధానంగా సీబీఐ ఆరా తీసింది. హత్య
జరిగిన రోజు అవినాష్‌రెడ్డి తన ఇంటి నుంచి వివేకా ఇంటికి ఎంత సమయంలో రావొచ్చు
అనేదానిపై సాంకేతికంగా ఇప్పటికే ఆధారాలు సేకరించిన అధికారులు మరో సారి
క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి వచ్చినట్టు తెలుస్తోంది. తిరిగి మళ్లీ వివేకా
ఇంటికి ఇచ్చి సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. వివేకా ఇంట్లో పనిచేసే
కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లాను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. హత్య జరిగిన
రోజు ఇంట్లో ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీశారు. ఘటన జరిగిన రోజు వివేకా
మృతదేహాన్ని ఫొటోలు, వీడియోలు తీసి ఇనయతుల్లా కుటుంబ సభ్యులకు పంపారు. సోమవారం
సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో సీబీఐ అధికారులు తాజాగా వివేకా ఇంటిని,
అవినాష్‌రెడ్డి ఇంటిని పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది.