వాణిజ్య పన్నుల శాఖకు నిర్దేశించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడు వాణిజ్య పన్నుల శాఖకు భారీ లక్ష్యాన్ని
నిర్దేశించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.85,412 కోట్లు సముపార్జించాలని
స్పష్టం చేసింది. 2022-23లో వచ్చిన రాబడి రూ.72,525 కోట్ల కంటే ఇది రూ.12,887
కోట్లు అధికం. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చి పెట్టేది
వాణిజ్య పన్నుల శాఖే. దీంతో సర్కారు ఆ శాఖపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఏటికేడు
వసూళ్ల లక్ష్యాలు పెంచుతూ పోతోంది. అందుకు అనుగుణంగానే 2020-21 ఆర్థిక
సంవత్సరంలో రూ.52,436 కోట్లు రాగా, 2021-22లో సుమారు రూ.12,585 వేల కోట్లు
పెరిగి రాబడి రూ.65,021 కోట్లకు చేరింది. 2022-23లో సుమారు రూ.7,500 వేల
కోట్లు (అంతకుముందు ఏడాదికన్నా 12%) పెరిగింది.
తనిఖీలు పెంచితేనే : గత ఏడాది కంటే దాదాపు రూ.12,887 కోట్లు అధిక రాబడి
లక్ష్యాన్ని నిర్దేశించిన సర్కారు..ఈ మేరకు వాణిజ్య పన్నులశాఖ యంత్రాంగాన్ని
అప్రమత్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యాపార, వాణిజ్య సంస్థలు తాము
నిర్వహిస్తున్న ఆర్థిక లావాదేవీలకు అనుగుణంగా పన్నులు చెల్లిస్తున్నాయా లేదా
అనే కోణంలో నిశితంగా పరిశీలించాలని అధికారులకు స్పష్టంచేసింది. చిన్న
వ్యాపారుల కంటే ఎక్కువ టర్నోవర్‌తో వ్యాపారం చేసే సంస్థలపై దృష్టిసారించడం
ద్వారా ఎగవేతలను నియంత్రించవచ్చని సూచించింది. సర్కారు మార్గదర్శకాలతో వాణిజ్య
పన్నుల శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యాపార లావాదేవీలపై నిఘా పెంచడంతోపాటు
వాహన తనిఖీలను ముమ్మరంచేయడం, బయట రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వస్తున్న
దిగుమతులకు సంబంధించి వే బిల్లుల తనిఖీలు విస్తృతం చేయడం వంటి చర్యలతో రాబడిని
పెంచుకునేందుకు సిద్ధమవుతోంది. ‘జీఎస్టీ చెల్లింపులను ఆడిట్ చేయడానికి
కేంద్రం తాజాగా అన్ని రాష్ట్రాలకు గడువు నిర్ణయించింది.
2017-18 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం వరకూ చెల్లింపుల తాలూకు ఆడిట్‌ను
ఎప్పటిలోపు పూర్తిచేయాలో నిర్దేశించింది. ఏ సంస్థ ఎంత పన్ను చెల్లిస్తోంది?
దాని ఆదాయమెంత? ఆదాయపన్ను శాఖకు సమర్పించిన రిటర్నులలో చూపించిన లెక్కలేమిటి?
బ్యాంకులో నగదు డిపాజిట్లు ఏ మేరకు ఉన్నాయి? వంటివన్నీ క్షుణ్నంగా పరిశీలించి
ఆయా సంస్థలు జీఎస్టీ లేదా వ్యాట్‌ను నిర్ణీత మొత్తంలో చెల్లించాయో లేదో
పరిశీలించాలని పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తిచేయడంతోపాటు తనిఖీలు పక్కాగా
జరిపితే సర్కారు నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవడం కష్టమేమీ కాదు. పైపెచ్చు
వాణిజ్య పన్నుల శాఖ రాబడి రూ.లక్ష కోట్లకు చేరే అవకాశాలున్నాయని ఆ శాఖ
సీనియర్ అధికారి ఒకరు వివరించారు.
మద్యం, పెట్రో ఉత్పత్తులు.. జీఎస్టీ : గతేడాది పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై
వ్యాట్ ద్వారా రూ.14,987 కోట్లు, మద్యం విక్రయాలపై వ్యాట్ ద్వారా రూ.14,287
కోట్లు, జీఎస్టీ ద్వారా రూ.34,685 కోట్ల ఆదాయం సమకూరింది. చాలా కాలంగా
పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ పరిహారం కింద మరో రూ.2,796 కోట్లు కేంద్రం నుంచి
గతేడాది వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం, పెట్రో ఉత్పత్తుల విక్రయాలు,
వృత్తి పన్నులపైనే రూ. 39,500 కోట్లు వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది.