సైనిక వాహనంపై టెర్రరిస్టులు గ్రనేడ్లు విసరడంతో ఘటన
పూంచ్ : జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ల
దాడిలో అయిదుగురు భారత సైనికులు అమరులయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
అతడిని రాజౌరిలోని సైనిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ
జవాన్లందరూ రాష్ట్రీయ రైఫిల్స్ దళానికి చెందినవారని, ఉగ్రవాదులను
మట్టుపెట్టేందుకు వీరిని మోహరించారని సైన్యం తెలిపింది. సైనికులు
ప్రయాణిస్తున్న ఓ ఆర్మీ ట్రక్కు భింబర్ గలీ నుంచి సాంగియోట్కు వెళ్తుండగా
మధ్యాహ్నం మూడు గంటలకు ఈ దారుణం చోటు చేసుకుంది. తొలుత పిడుగుపాటు వల్ల
ట్రక్కులో మంటలు చెలరేగాయా? అన్న అనుమానాలు వచ్చినప్పటికీ దర్యాప్తులో
ఉగ్రవాదుల పనేనని తేలింది. సంఘటన వివరాలను రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్కు
సైన్యాధిపతి మనోజ్ పాండే వెల్లడించారు. ఘటనపై కేంద్రమంత్రి తీవ్ర
దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భారీ వర్షాలు, దృశ్య స్పష్టత సరిగా లేకపోవడం
వంటి పరిస్థితులను ఉగ్రవాదులు అనుకూలంగా మలుచుకున్నారని సైనిక అధికారులు
విశ్లేషించారు. ఈ ఘటనను బీజేపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఖండించాయి.