ఇస్లామాబాద్ : గోవా వేదికగా మే 4, 5 తేదీల్లో జరిగే షాంఘై సహకార సంస్థ
(ఎస్సీవో) సదస్సులో పాల్గొనేందుకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్
భుట్టో జర్దారీ భారత్‌కు రానున్నారు. ఎస్సీవో విదేశాంగ మంత్రుల భేటీకి
హాజరుకావాలన్న భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ ఆహ్వానం మేరకు ఈ
పర్యటన ఖరారైందని పాక్ విదేశీ వ్యవహారాల కార్యాలయ అధికారి ముంతాజ్ జహ్రా
బలోచ్ తెలిపారు. ఇక్కడ విలేకరులతో ఆమె మాట్లాడుతూ ఈ పర్యటన ఎస్సీవో కూటమి
పట్ల పాక్ నిబద్ధతకు అద్దం పడుతోందన్నారు. రష్యా, చైనా, భారత్,
పాకిస్థాన్లతోపాటు మధ్య ఆసియా దేశాలతో కూడిన ఎస్సీవో అంతర్జాతీయంగా
ప్రభావశీల ప్రాంతీయ కూటమిగా గుర్తింపు పొందింది. 2014లో అప్పటి పాకిస్థాన్
ప్రధాని నవాజ్ షరీఫ్ పర్యటన తర్వాత ఆ దేశ నాయకులు భారత్‌కు రావడం ఇదే
తొలిసారి. 2015 డిసెంబరులో నాటి భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్
పాక్‌లో పర్యటించగా ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాకిస్థాన్‌ను
సందర్శించారు.
బిలావల్ భుట్టో పర్యటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార
ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మీడియా ఎదుట ఆచితూచి స్పందించారు. అందరితోపాటు
వాళ్లనూ పిలిచాం. ఏదో ఒక దేశం పాల్గొనడం గురించి మాట్లాడుకోవడం సరికాదని
బదులిచ్చారు. ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు ఉంటాయా అన్న ప్రశ్నకు
ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు.
పీవోకే ప్రధానిగా చౌధ్రి అన్వరుల్ హక్ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్
(పీవోకే) ప్రధానిగా చౌధ్రి అన్వరుల్ హక్ ఎన్నికయ్యారు. పాక్ మాజీ ప్రధాని
ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ నేత అయిన
హక్.. ప్రాంతీయ అసెంబ్లీలోని అన్ని ప్రధాన పార్టీలకు చెందిన సభ్యుల మద్దతు
సంపాదించారు. ఇదివరకటి ప్రధాని సర్దార్ తన్వీర్ ఇలియాస్ ఖాన్ ప్రాంతీయ
కోర్టునుద్దేశించి చేసిన వ్యాఖ్యల కారణంగా పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే.