డి.వై.చంద్రచూడ్
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టుకు వచ్చే వ్యాజ్యాలు అధికంగా ఉండడంతో జడ్జీలపై పని
భారం పెరిగిపోతోందని ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్
తెలిపారు. కేసుల ఒత్తిడి వల్లే తనకు ముందున్న సీజేఐలు రాజ్యాంగ ధర్మాసనాల
ఏర్పాటుకు సిద్ధపడలేదన్నారు. ఒక్కో ధర్మాసనానికి అయిదుగురు జడ్జీల చొప్పున
కేటాయించుకుంటూ పోతే మిగతా వ్యాజ్యాల విచారణపై దాని ప్రభావం పడుతుందని
వివరించారు. కాబట్టి సమయ పాలన పాటిస్తూ వాదనలు త్వరగా ముగించేలా చూడాలని
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కోరుతున్న పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు జస్టిస్
చంద్రచూడ్ సూచించారు. ఈ కేసు విచారణ వరుసగా మూడో రోజైన గురువారం కూడా
రాజ్యాంగ ధర్మాసనం ముందు కొనసాగింది. సీనియర్ న్యాయవాది ఎ.ఎం.సింఘ్వి వాదనలు
వినిపించారు. మరికొందరు న్యాయవాదుల పేర్ల జాబితాను అందజేయగా ఒక్కొక్కరు 30
నిమిషాల్లోనే తమ వాదనలు ముగించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అవతలి
పక్షానికి కూడా పిటిషనర్లకు ఇచ్చినంత సమయాన్ని కేటాయించాల్సి ఉంటుందని గుర్తు
చేసింది. ఈ నెల 24న పిటిషనర్ల తరఫు వాదనలను ముగించాలని నిర్దేశించింది. తదుపరి
విచారణ సోమవారానికి వాయిదాపడింది.
వివాహ భావనను పునర్నిర్వచించుకోవాల్సి రావచ్చు: సీజేఐ జస్టిస్
డి.వై.చంద్రచూడ్
స్వలింగ సంపర్కుల ఇష్టపూర్వక శారీరక సంబంధాలు నేరం కాదని నిర్ణయించిన
నేపథ్యంలో వారి మధ్య ఏర్పడే వైవాహిక బంధాన్ని గుర్తించాల్సిన పరిస్థితి
ఏర్పడుతుందని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. సంతానం కోసమే వివాహ వ్యవస్థ
లేదని, కలిసి జీవించడం కూడా దానిలో భాగమేనని పేర్కొన్నారు. స్వలింగ దంపతులు
పిల్లలను క్రమశిక్షణతో పెంచలేరన్న వాదనను తోసిపుచ్చారు. స్త్రీ, పురుషులు
జంటగా ఉన్న కుటుంబాల్లో హింస, ఘర్షణలు, వాగ్వాదాలు, విడిపోవడాలు జరగడం లేదా
అని ప్రశ్నించారు. ఇలాంటివన్నీ చిన్నారులపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తూనే
ఉన్నాయని తెలిపారు. తన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ అయ్యే
అవకాశం ఉందని చెబుతూ అయినప్పటికీ వెనుకాడేది లేదన్నారు. విద్యావంతులు,
ఉన్నతశ్రేణి దంపతులు ఇప్పుడు చాలా వరకు ఒక్క సంతానంతోనే సరిపుచ్చుకుంటున్నారని
వివరించారు. మగపిల్లాడే కావాలన్న అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారని తెలిపారు.
ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎస్.ఆర్.భట్, జస్టిస్
హిమాకోహ్లీ, జస్టిస్ పి.ఎస్.నరసింహ సభ్యులుగా ఉన్నారు. స్వలింగ వివాహాల
చట్టబద్ధత అంశంపై రోజంతా వాదనలు కొనసాగాయి.