మే 20 నాటికి 2వేల గ్రామాల్లో భూహక్కు పత్రాల పంపిణీ
ఇప్పటికే 1.94 లక్షల భూహక్కు పత్రాలు పంపిణీకి సిద్దం
భూ వివాదాల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ల ద్వారా స్పెషల్ డ్రైవ్
అర్బన్ ఏరియాల్లో పిఓఎల్ఆర్ నివేదికలు
సమావేశంలో పాల్గొన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన
ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ముఖ్య సలహాదారు అజేయ్ కల్లాం
అమరావతి : అమరావతి సచివాలయంలోని మూడో బ్లాక్ లో గురువారం జగనన్న శాశ్వత
భూహక్కు-భూరక్ష పథకం అమలుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన
కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు ధర్మాన
ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ్ కల్లాంతో పాటు
పలువురు అధికారులు పాల్గొన్నారు. సమగ్ర సర్వేపై ఇప్పటి వరకు అధికారులు
చేపట్టిన చర్యలపై మంత్రులు సమీక్షించారు. పథకం అమలుపై మంత్రుల కమిటీకి
అధికారులు వివరాలను తెలియచేశారు. ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న భూహక్కు-భూరక్ష పథకంలో తొలి దశలో 2వేల
గ్రామాల్లో మే 20వ తేదీలోగా సర్వే పూర్తి చేయాలన్న సీఎం వైయస్ జగన్ ఆదేశాల
మేరకు అధికారులు పనిచేయాలని కోరారు. డ్రోన్ సర్వే, మ్యాపింగ్, గ్రౌండ్
ట్రూతింగ్, రికార్డులపై వివాదాలను పరిష్కరించే ప్రక్రియను వేగవంతం చేయాలని
సూచించారు.
మొదటిదశలో భాగంగా 2వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలను పంపిణీ చేసేందుకు చురుగ్గా
ఏర్పాటు చేయాలని మంత్రులు ఆదేశించారు. ఇప్పటి వరకు 1,94,571 భూహక్కు పత్రాలను
ఇప్పటి వరకు సిద్దం చేశారని, ఈకెవైసి ద్వారా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా
వాటిని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూవివాదాలకు ఆస్కారం
లేకుండా భూయజమానుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు జిల్లా
కలెక్టర్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలో గ్రామీణ
ప్రాంతాల్లో సర్వే ప్రక్రియ వేగంగా జరుగుతోందని, దానితో పాటు అర్భన్
ప్రాంతాల్లో కూడా సర్వేను చురుగ్గా నిర్వహించాలని మంత్రులు ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 యుఎల్బిల్లో 15 లక్షల ఎకరాలకు సర్వే చేయాల్సి
ఉందని అన్నారు. అర్బన్ ఏరియాలోనే 5.5 లక్షల ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ గా
ఉందని, మిగిలిన 9.44 లక్షల ఎకరాలు అర్బన్ ఏరియా కింద ఉందని అన్నారు. ఈ మొత్తం
ఏరియాలో 38.19 లక్షల ప్రాపర్టీలను సర్వే చేయాల్సి ఉందని దీనిని కూడా నిర్ధేశిత
గడువులోగా పూర్తి చేయాలని మంత్రులు కోరారు.
ఈ నెలాఖరు నాటికి మొదటి దశలో గుర్తించిన 12వేల గ్రామాల్లో జరుగుతున్న సర్వే
ప్రక్రియలో 10,409 గ్రామాల్లో డ్రోన్ ఫ్లై ప్రక్రియ పూర్తయ్యిందని, 7158
గ్రామాల్లో డ్రోన్ ఇమేజ్ లను తీసుకున్నమని, 3758 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్
పూర్తి చేశామని అధికారులు వివరించారు. అలాగే 2611 గ్రామాల్లో సర్వే
పూర్తయ్యిందని, తుది దశ కోసం 2391 గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల పరిశీలన కూడా
పూర్తయ్యిందని తెలిపారు. సర్వే ప్రక్రియలో జాప్యం లేకుండా ఉండేందుకు ముందుగానే
రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నామని, దీనిలో భాగంగా 4 లక్షలకు పైగా
రికార్డులకు మ్యుటేషన్ అవసరమని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. జూన్
నాటికి రాష్ట్రంలో డ్రోన్ ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో
పనిచేస్తున్నామని, ఇప్పటి వరకు 86 చదరపు కిలోమీటర్ల మేర డ్రోన్ ఫ్లై పూర్తి
చేశామని వివరించారు. సర్వే పూర్తి చేసిన గ్రామాల్లో భూ సరిహద్దులను
గుర్తించేందుకు ఇప్పటి వరకు 25.8 లక్షల సర్వే రాళ్ళు సిద్దంగా ఉన్నాయని
మైనింగ్ అధికారులు తెలిపారు.
ఇప్పటికే 18.9 లక్షల సర్వే రాళ్ళను సరఫరా చేశామని, మరో 12.3 లక్షల రాళ్ళు ఆయా
గ్రామాలకు తరలించడానికి సిద్దంగా ఉన్నాయని వివరించారు. రోజుకు 50 వేల సర్వే
రాళ్ళను సిద్దం చేస్తున్నామని తెలిపారు. మే 20వ తేదీ లోగా సర్వే పూర్తయ్యిన
గ్రామాల్లో రాళ్ళను పాతే ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు.
అర్బన్ ప్రాంతాల్లో సమగ్ర సర్వేపై ఇప్పటి వరకు 30.11 లక్షల ప్రాపర్టీలను
వెరిఫై చేశామని, దానిలో 36.32 లక్షల స్ట్రక్చర్స్ ఉన్నాయని మున్సిపల్
అడ్మినిస్ట్రేషన్ అధికారులు మంత్రుల కమిటీకి వివరించారు. ఇప్పటి వరకు యుఎల్బీ
సరిహద్దులను అన్నింటినీ మ్యాన్ వల్ గా గుర్తించామని, అందుబాటులో ఉన్న
మున్సిపల్ రికార్డులను ఆధారం చేసుకుని పిఓఎల్ఆర్ నివేదికను సిద్దం
చేసుకున్నామని తెలిపారు. అర్బన్ ఏరియాల్లో సర్వే కోసం మాస్టర్ ట్రైనర్ల ద్వారా
అన్ని జిల్లాల్లోనూ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని అన్నారు. ఈ సమావేశంలో
సిసిఎల్ఎ జి.సాయిప్రసాద్, అటవీ దళాల అధిపతి వై.మధుసూధన్ రెడ్డి, పిఆర్&ఆర్డీ
కమిషనర్ సూర్యకుమారి, సర్వే అండ్ సెటిల్ మెంట్ కమిషనర్ సిద్దార్థ్ జైన్,
ఎంఎయుడి కమిషనర్ కోటేశ్వరరావు, డిఎంజి విజి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.