ఈ నెల 24 నుండి నూతన బ్యాచ్ కు అవకాశం, ఉచితంగా స్టడీ మెటీరియల్
పాలిటెక్నిక్ విద్య, ఉపాధిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరంతర అవగాహనా సదస్సులు
పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫీజు చెల్లింపుకు ఈనెల 30 తుది గడువు
విజయవాడ : అతి పిన్న వయస్సులొ సులువుగా ఉపాధి, ఉద్యొగ అవకాశాలు పొందడానికి
“పాలిటెక్నిక్ విద్య” ఉత్తమమైన మార్గమని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమీషనర్
చదలవాడ నాగరాణి తెలిపారు. యువతను పాలిటెక్నిక్ విద్య వైపు మళ్లించే చర్యలలో
భాగంగా అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో పాలిసెట్ – 2023 కోసం ఉచిత శిక్షణ
అందిస్తున్నామన్నారు. పదవ తరగతి విద్యార్ధులలో అవగాహన కలిస్తూ రాష్ట్ర
వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే పాలిసెట్
తొలివిడద కోచింగ్ ప్రక్రియ 17 వ తేదీన ప్రారంభించగా, 24వ తదీ నుండి మరో బ్యాచ్
ప్రారంభిస్తున్నామని నాగరాణి వివరించారు. శిక్షణ పొందిన ప్రతి విద్యార్ధికి
ఇంగ్లీష్, తెలుగు మీడియంలలో ఉచిత స్టడీ మెటీరియల్ అందిస్తున్నామన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ ప్రవేశము కోసం మే 10వ తేదీన
రాష్ట్ర వ్యాప్తంగా 61 పట్టణాలలోని 410 పరీక్ష కేంద్రములలో పాలీసెట్ 2023
నిర్వహిస్తున్నామని, ఈ పరీక్షకు సుమారు 1,50,000 మంది విద్యార్థులు
హాజరవుతారన్నారు. ఈ ప్రవేశ పరీక్షకు ప్రభుత్వం నిర్దేశించిన పదవ తరగతి సిలబస్
నుండి గణిత శాస్త్రం 50 మార్కులు , భౌతిక శాస్త్రము 40 మార్కులు, రసాయన
శాస్త్రము 30 మార్కులు మొత్తం కలిపి 120 మార్కులకు రెండు గంటల కాల నిర్దేశములో
పరీక్ష ఉంటుందన్నారు. ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే ఓసి, బిసి విద్యార్ధులు
రూ.400, ఎస్టి ఎస్సీ విద్యార్ధులు రూ.100 ప్రవేశ రుసుమును దగ్గరలోని ప్రభుత్వ
పాలిటెక్నిక్ లోగాని, polycetap.nic.in వెబ్ సైట్ ద్వారా కాని ఏప్రిల్
30 సాయంత్రం 5గంటల లోపు చెల్లించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 84 ప్రభుత్వ
పాలిటెక్నిక్ లు, 176 ప్రైవేటు పాలిటెక్నిక్ లతో పాటు, ఈ విద్యా సంవత్సరము
నుండి నూతనముగా ప్రారంభిస్తున్న బేతంచెర్ల (నంద్యాల జిల్లా), మైదుకూరు (కడప
జిల్లా), గుంతకల్లు (అనంతపురం జిల్లా) ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ప్రవేశాలు
పొందగలుగుతారని నాగరాణి తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా బాలికల కోసం ప్రత్యేకంగా 10 ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్
లు , 2 మైనారిటి పాలిటెక్నిక్ లు ఉండగా, ఎస్టి ఎస్పి విద్యార్ధుల అభ్యున్నతి
కోసం మరో 9 ఆదర్శ ఆశ్రమ పాలిటెక్నిక్ లను ఉచిత వసతి, బోజన సదుపాయాలతో రాష్ట్ర
ప్రభుత్వం నిర్వహిస్తుందని చదలవాడ వివరించారు. అర్హులైన ప్రతి విద్యార్ధినికి
సంవత్సరమునకు రూ.50,000 చొప్పున మూడు సంవత్సరాల ప్రగతి స్కాలర్ షిప్
లభిస్తుందన్నారు. పాలిసెట్-2023 ద్వారా ప్రవేశము పొందిన విద్యార్ధులందరికీ
స్కాలర్ షిప్ సదుపాయం అందుబాటులో ఉందన్నారు. జగనన్న విద్యదీవేన, వసతి దీవెన
ద్వారా విద్యార్ధులకు పిజు రియంబర్స్మేంట్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు.
ఆధునిక సాంకేతిక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన పాలిటెక్నిక్ కోర్సులకు
అత్యధిక అర్హతలు, అనుభవము కలిగిన అధ్యాపకులతో విద్యాబోధన సాగుతుందని కమీషనర్
స్పష్టం చేసారు.
24 రకాల కోర్సులలో చివరి సంవత్సరం విద్యార్ధులందరికీ ఆరునెలల కాలం అయా
సంస్ధలలో పారిశ్రామిక శిక్షణ ఇప్పించటం ద్వారా ఉత్తమ నైపుణ్యాభివృద్ది
సాధించేలా కృషి చేస్తున్నామన్నారు. 3 సంవత్సరముల పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి
చేసిన విద్యార్ధులకు గణనీయమైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సాంకేతిక విద్య
శాఖ ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తుందన్నారు. విద్యార్దులలో క్రీడా స్పర్తిని
పెంపొందించేలా స్పోర్ట్స్ మీట్ లు, అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి
తీసేలా టెక్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామన్నారు. సాంకేతిక విద్యా కమీషనర్ ప్రత్యేక
ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ప్రయోగశాలల
ఆధునీకరణ, మెరుగైన వసతి కల్పనలను చేపట్టడం జరిగిందని సాంకేతిక విద్యా బోర్డు
కార్యదర్శి విజయ భాస్కర్ పేర్కొన్నారు. పదవ తరగతి పరీక్షలు ముగిసినందున
విద్యార్దులు పాలిసెట్-2023కు దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరములకు హెల్ప్
లైన్ నెంబర్ 08645-293151, 7901620551/557/567 లద్వారా సంప్రదించవచ్చన్నారు.