సుందర కట్టడం. 12 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 2 వేల 800వేల కోట్ల వ్యయంతో
హైదరాబాద్లో అమెరికన్ కాన్సులేట్ భవనాన్ని తీర్చిదిద్దారు. అధునాతన
సాంకేతికతకు భారతీయ సంస్కృతిని జోడించి భవంతిని నిర్మించారు. వీసా సహా వివిధ
దరఖాస్తులను ఒకేరోజు 3,500 పూర్తి చేసే సామర్థ్యంతో కొత్త కాన్సులేట్ సత్వర
సేవలందించనుంది. 2023లో మిలియన్ అమెరికన్ వీసాలు జారీ చేసే లక్ష్యంతో
పనిచేయనుంది.
హైదరాబాద్ నానక్రామ్గూడలో సువిశాల ప్రాంగణంలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో నూతన
అమెరికన్ కాన్సులేట్ భవనం రూపుదిద్దుకుంది. భవంతిలో మొత్తం 55 వీసా
విండోస్ని అందుబాటులోకి తెచ్చారు. గతంలో వెయ్యి దరఖాస్తులు మాత్రమే
పూర్తిచేసే వీలుండగా ప్రస్తుతం కొత్త భవనం అందుబాటులోకి రావడం వల్ల ఆ సంఖ్య
మూడురెట్లకు పెరగనుంది. కార్యాలయం చుట్టూ పచ్చదనం పరుచుకున్న నందనవనం, వర్షం
నీరు ఒడిసి పట్టే సాంకేతికత, టెర్రస్ గార్డెన్, సౌర విద్యుత్ ఉత్పత్తి మరో
ప్రత్యేకత. అమెరికన్ సాంకేతికతతో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా భవంతి
లోపలి భాగాలను తీర్చిదిద్దారు.
బేగంపేట పైగా ప్యాలెస్లో కొనసాగుతున్న యుఎస్ కాన్సులేట్ కార్యాలయం నేటి
నుంచి నానక్రామగూడలోని నూతన భవంతిలోకి మారనుంది. ఈ కార్యాలయం ద్వారా ఏపీ,
తెలంగాణ సహా ఒడిశా రాష్ట్రాలకు యూఎస్ వీసాల జారీ చేయనుంది. అగ్రరాజ్యానికి
వెళ్లే పర్యాటకులకు సేవలు అందించనున్నారు. నూతన కార్యాలయం మున్ముందు మరింత
కీలకంగా మారనుందని హైదరాబాద్లో అమెరికన్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్
లార్సన్ వివరించారు.
‘అమెరికాలో ఉన్నత విద్య చదివేందుకు చాలామంది విద్యార్థులు ఆసక్తిచూపుతారు.
అలాంటి వారి కోసం సమగ్ర సమాచారాన్ని హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్
కార్యాలయం అందిస్తుంది. అమెరికాలో ఉండే వ్యవస్థలు, ప్రభుత్వ విధానాలు,
విశ్వవిద్యాలయాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం. భారత్లో ముఖ్యంగా
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాలో చదివేందుకు ఎక్కువగా వస్తున్నారు.
అలాంటి వారికోసం అమెరికాలో లభించే అవకాశాలు, ఉపాధి కల్పనపైనా ప్రత్యేక
కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భారత్ నుంచి చదివే వారికి అక్కడి వర్శిటీలు
అందించే కోర్సులు, ఉపకారవేతనం తదితర విషయాలను వివరిస్తామని హైదరాబాద్లో
అమెరికన్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ వెల్లడించారు.