అమరావతిలో బయటివారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై రైతులు హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు సీజే ధర్మాసనం ముందు రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది
దేవదత్ కామత్ వాదనలు వినిపించారు. గతంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం, రాజధాని
అమరావతి పై ఇచ్చిన తీర్పులోని అంశాలను కామత్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
పూర్తిస్థాయిలో వాదనలు వినేందుకు విచారణను శుక్రవారానికి కోర్టు వాయిదా
వేసింది. మధ్యంతర ఉత్తర్వుల కోసం ఇరుపక్షాల వాదనలు వినాలని హైకోర్టు
నిర్ణయించింది.
అమరావతి రైతులతో చెలగాటం : అమరావతి రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటానికి
దిగుతోంది. రాజధానేతర పేదలకు రాజధానిలో ఇళ్ళ స్థలాలు కల్పించటంపై కోర్టును
ఆశ్రయించిన రైతులకు స్టే రాకపోవటంతో.. అదను చూసుకుని ప్రభుత్వం
విరుచుకుపడింది. అమరావతిలోని ఆర్-5 జోన్లో రాజధానేతర పేదలకు ఇళ్ల స్థలాల
పంపిణీ, ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి మొండిగా వెళ్లాలని నిర్ణయించింది.
కోర్టు పరిధిలో ఉన్నా నివాస స్థలాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు టెండర్లను
పిలవాలని సీఆర్డీఏను నిర్దేశించింది. దీంతో సీఆర్డీఏ ఉన్నతాధికారులు ఇటీవల
ఆగమేఘాల మీద టెండర్లు పిలిచారు. అవి లెవలింగ్, రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి
వసతి, వీధిలైట్లు తదితర పనులుగా తెలుస్తోంది. ఆర్-5 జోన్లో ఎన్టీఆర్,
గుంటూరు జిల్లాలకు చెందిన 49 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి
సిద్ధం కావాలని ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో
రెండు జిల్లాల కలెక్టర్లకు నిర్దేశించిన సంగతి తెలిసిందే. అంతకుముందే
ప్రభుత్వం రహస్యంగా జీవో ఎంఎస్ 45 ద్వారా ఆర్ 5 జోన్ లోని 1134.58 ఎకరాలలో
ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 24 వేల మంది లబ్ధిదారులకు 583.93 ఎకరాలు, గుంటూరు
జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 550.65 ఎకరాలను కేటాయించారు.