ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాలి
రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జగనన్నే
మా భవిష్యత్తు” కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా కోనసాగుతోందని
రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు.
పలు అంశాలపై ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్ర
సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వాన్ని ప్రజల గడప వద్దకు చేర్చిన
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు అపూర్వ రీతిలో మద్దత్తు
ఇస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఇంటింటా విశేష ఆదరణ లభిస్తోందని,
ప్రజా ప్రతినిధులు, కన్వీనర్లు, గృహ సారథులకు ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం
పలుకుతున్నారని తెలిపారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో ఇప్పటివరకు
64,01,890 కుటుంబాలు పాల్గొని తమ మద్దతు తెలిపాయన్నారు.
ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాలి : కానిస్టేబుల్ (జీడి) సిఎపిఎఫ్ పరీక్షను
పదమూడు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని హోం మంత్రిత్వ శాఖ చారిత్రాత్మక
నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నిర్ణయం వల్ల అర్హులైన అభ్యర్థులకు సరైన ఉద్యోగం
రావడానికి భాష అడ్డుపడదని చెప్పారు. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాలని, ప్రతి
ప్రాంతానికి సమాన న్యాయం జరగాలని ఆయన అన్నారు.