అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)లో ‘ఇండియా
మీడియేషన్ డే
హైదరాబాద్ : సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తోందని
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు.
నగరంలోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)లో
నిర్వహించిన ‘ఇండియా మీడియేషన్ డే’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడారు. మీడియేషన్ డే కార్యక్రమం నిర్వహిస్తున్న అందరికీ అభినందనలు
తెలిపారు. మొదటి ఇండియా మీడియేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో
సంతోషంగా ఉందన్నారు. ‘‘హైదరాబాద్‌లో మీడియేషన్ కేంద్రం ఏర్పాటుపై నేను,
జస్టిస్ లావు నాగేశ్వరరావు ఎన్నోసార్లు చర్చించుకున్నాం. మొదట్లో చిన్న
స్థాయిలో మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటు చేద్దామనుకున్నాను. కానీ ఆయన దాన్ని
అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారు. హైదరాబాద్ మీడియేషన్ కేంద్రం ఏర్పాటు
వెనుక జస్టిస్ లావు నాగేశ్వరరావు కృషి ఎంతో ఉంది. మధ్యవర్తిత్వ కేంద్రం
ఏర్పాటుకు జస్టిస్ హిమాకోహ్లీ కూడా ఎంతో సహకరించారు. ప్రస్తుతకాలంలో
మధ్యవర్తిత్వ ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోంది. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ
తిరిగే బాధ తప్పుతుంది. మధ్యవర్తిత్వం అనేది మన పురాణాల కాలంలోనూ ఉంది.
కౌరవులు, పాండవులు మధ్య కృష్ణుడి మధ్యవర్తిత్వం విఫలం వల్లే మహాభారత యుద్ధం
జరిగింది. ఆర్థిక సంస్కరణల కారణంతోపాటు మీడియేషన్ బిల్లు రాక వల్ల
మధ్యవర్తిత్వ ప్రాధాన్యం భారత్‌లోనూ పెరిగింది. ఈ ప్రక్రియ విశ్వసనీయతతో
వేగవంతంగా సాగాలి. ఉభయపక్షాలకు ఉపయోగకరంగా మధ్యవర్తిత్వ ప్రక్రియ ఉండాలి.
దీనిలో కృత్రిమమేథనూ భాగం చేస్తున్నారు’’ అని జస్టిస్ ఎన్.వి.రమణ
వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో జస్టిస్ ఎన్.వి.రమణతో పాటు జస్టిస్ హిమా
కోహ్లి, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్రన్, మరికొందరు
న్యాయకోవిదులు పాల్గొన్నారు. సింగపూర్ అంతర్జాతీయ మీడియేషన్ సెంటర్
ఛైర్మన్ జార్జ్ లిమ్ కూడా హాజరయ్యారు.