19న సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
జేసిఎస్ కోఆర్డినేటర్ల సమావేశంలో ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం : జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన
లభించిందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన
కృష్ణదాస్ అన్నారు. జేసిఎస్ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త హర్షవర్ధన్
రెడ్డితో కలసి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల జేసిఎస్
కోఆర్డినేటర్లతో శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన
మాట్లాడారు. ప్రజలకు మంచి చేశాం గనుకనే ధైర్యంగా వెళ్లి సువర్ణ పాలన గురించి
చెప్పగలుగుతున్నామని వివరించారు. అవినీతి లేని పారదర్శక పాలన అందించామని, గడప
గడపకూ మన ప్రభుత్వం, జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం
చేసిన, చేస్తున్న మంచిని ప్రతి కుటుంబానికి వివరిస్తున్నామన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఎంత లబ్ధి
చేకూరిందని వివరిస్తూ.. ప్రజా సర్వే చేపడుతున్నామని, మంచి చేస్తున్నాం గనకనే
ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి మరోసారి మద్దతు పలకాలని కోరుతున్నామని చెప్పారు.
జేసెస్ కోఆర్డినేటర్లు, గృహ సారథులకు నిబద్దత, నిజాయితీ, విశ్వసనీయతలే
కొలమానమని, వారి సారథ్యంలోనే 2024 ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పారు. పార్టీ
బాధ్యతలను సమర్థ వంతంగా నిర్వహించే వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు
లభిస్తాయని పేర్కొన్నారు. 2019 ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా
పర్యటన విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు.
జెసిఎస్ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ
కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు అవసరమైన కిట్లపై అవగాహన కలిగి
ఉండాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఏవైనా ప్రజా సమస్యలు ఉంటే తమ జట్టుకు
తెలియజేయాలని కోరారు. మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం అత్యంత
ప్రతిష్టాత్మకమని, దేశంలో ఎక్కడా లేనివిధంగా జరుగుతున్న పీపుల్స్ సర్వేను
పకడ్బందీగా చేయాల్సిందేనని సూచించారు. కార్యక్రమంలో పార్టీ వర్కింగ్
ప్రెసిడెంట్ శిమ్మ రాజశేఖర్, గుళ్లపల్లి గణేష్, జలుమూరు ఎంపీపీ వాన గోపి,
రెండు జిల్లాల నుంచి 56 మంది జెసిఎస్ కోఆర్డినేటర్లు హాజరయ్యారు.