మీడియా ప్రతినిధులు
మల్లన్న సాగర్, మిషన్ భగీరథ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కాళేశ్వరం పంప్ హౌస్,
కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులను సందర్శించిన మీడియా ప్రతినిధులు
ఎండాకాలంలోనూ నిండుకుండల్లా ఉన్న జలాశయాలను చూసి ఆశ్చర్యపోయిన జర్నలిస్టులు
హైదరాబాద్ ::తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన వివిధ సాగునీటి
ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల
ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనతి కాలంలోనే
అత్యద్భుతమైన సాగునీటి రిజర్వాయర్లు నిర్మించడంపై సీఎం కేసీఆర్ పరిపాలనా
దక్షతకు, రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకు జర్నలిస్టులు కితాబిచ్చారు. వివిధ
జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో
పర్యటించారు. ముందుగా సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ ను మీడియా ప్రతినిధులు
సందర్శించారు.
మల్లన్న సాగర్ పంప్‌హౌస్ ద్వారా వందల కిలోమీటర్ల దూరం నుంచి అంత ఎత్తుకు
గోదావరి నీళ్లను తెచ్చి నిలువ చేయడంపై మీడియా ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం
చేశారు. తక్కు వ సమయంలో క్లిష్టమైన ప్రాజెక్టును పూర్తి చేయడం వెనుక ఉన్న
రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికల గురించి ఇంజనీర్లను అడిగి వివరాలు
తెలుసుకున్నారు. అనంతం మల్లన్న సాగర్ పరిసర ప్రాంతాల రైతులతో మీడియా
ప్రతినిధులు మాట్లాడి, మల్లన్న సాగర్ నిర్మాణ అనంతరం అన్నదాతలకు జరిగిన మేలు
గురించి తెలుసుకున్నారు. గజ్వేల్ లోని కోమటిబండలో మిషన్ భగీరథ ప్రాజెక్టును
పరిశీలించిన జర్నలిస్టులు, దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ
సురక్షిత మంచినీరు విజయంతంగా అందిస్తున్న తీరును పరిశీలించారు. మిషన్ భగీరథ
ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సైతం అనేకసార్లు ప్రశంసించిన విధానాన్ని గుర్తు
చేసిన మీడియా ప్రతినిధులు, మిషన్ భగీరథ పథకాన్ని దేశమంతా అమలుచేయాల్సిన అవసరం
ఉందన్నారు. అనంతరం గజ్వేల్ లో అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో
నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను జర్నలిస్టులు సందర్శించారు. స్వచ్ఛమైన
వాతావరణంలో పరిశుభ్రమైన పరిసరాల నడుమ నాణ్యమైన, శుభ్రమైన కూరగాయలు, మాంసం,
పండ్లు, పువ్వులు ఇలా ప్రజలకు అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు ఒకే చోట
విక్రయించే విధంగా మార్కెట్ లో సౌకర్యాలు ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం
చేసిన మీడియా ప్రతినిధులు, ఇలాంటి మార్కెట్ల ద్వారా వ్యాపారులకు, ప్రజలకు ఎంతో
మేలు జరుగుతుందన్నారు. అనంతరం కొండపోచమ్మ సాగర్, కాళేశ్వరం పంప్ హౌస్ లను
సందర్శించారు. కాళేశ్వరం లాంటి అతి భారీ లిఫ్డ్ ఇరిగేషన్ ప్రాజెక్టును అతి
తక్కువ సమయంలో పూర్తి చేసి రైతులకు నీళ్లందించిన తెలంగాణ ప్రభుత్వాన్ని మీడియా
ప్రతినిధులు కొనియాడారు. ఛీఫ్ ఇంజనీర్ హరిరాం ను అడిగి ప్రాజెక్టు కు
సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ గారి ప్రణాళికలు, సాగునీటి
నైపుణ్యాలను ఆసక్తిగా తెలుసుకున్నారు పలువురు జర్నలిస్టులు. తెలంగాణ రాష్ట్ర
ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్న పదానికి ప్రత్యక్ష నిదర్శనం కాళేశ్వరం
ప్రాజెక్టు అని మీడియా ప్రతినిధులు చర్చించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు
చేస్తున్న కార్యక్రమాలు దేశమంతటా అమలుచేస్తే అభివృద్ధి, సంక్షేమంలో దేశం
ముందడుగు వేయడమే కాకుండా, ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా మెరుగుపడతాయని మీడియా
ప్రతినిధులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులు,
ఈశాన్య రాష్ట్రాల జర్నలిస్టులు, పలు అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీలకు చెందిన
రిపోర్టర్లు పలు ప్రాజెక్టులను సందర్శించారు.