శ్రీకాకుళం : విశాఖ ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై
జరిగిన దాడి వాస్తవమని ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ
అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కోడికత్తి కేసులో ఎన్ఐఏ రిపోర్టును
కొన్ని వార్తా సంస్థలు వక్రీకరిస్తున్నాయన్నారు. కోడి కత్తి దాడి జగన్
చేయించుకున్నారన్న భావన కల్పిస్తున్నారని మండిపడ్డారు. జగన్ పై ఎయిర్
పోర్ట్‌లో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నదే తమ డిమాండ్ అన్నారు.
అలిపిరిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నక్సల్స్ దాడి చేశారని, అది కూడా
రాజకీయ లబ్ది కోసం బాబు చేయించుకున్నాడా అంటూ ప్రశ్నించారు. కోడికత్తి దాడికి
పాల్పడిన శ్రీనివాస్ ఏ ఉద్దేశ్యంతో చేసాడో తెలియాలన్నారు. ఎన్ఐఏ రిపోర్ట్‌లో
ఏముందో ఎలా తెలిసిందని మంత్రి బొత్స ప్రశ్నించారు.
విశాఖ ఉక్కుపై మా విధానం ఒక్కటే : విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూడా మంత్రి
మాట్లాడుతూ విశాఖ ఉక్కుపై తమ విధానం ఒక్కటే అని అన్నారు. స్టీల్ ప్లాంట్
ప్రైవేటీకరణకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ దెబ్బకు
ఉక్కు ప్రైవేటీకరణ నిలిచిపోయిందనేది అవాస్తవమని చెప్పుకొచ్చారు. అఖిలపక్ష
పార్టీలకు చిత్తశుద్ధి లేదని, అందుకే విశాఖ స్టీల్ విషయంలో అఖిలపక్షాన్ని
ఢిల్లీకి తీసుకువెళ్లటం లేదని తెలిపారు. అఖిలపక్ష పార్టీలపై తమకు విశ్వాసం
లేదని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.