రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ : ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ వి సైకో
ప్రేలాపనలని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది
విష్ణు విమర్శించారు. 61 డివిజన్ వాంబేకాలనీ హెచ్ బ్లాక్ 262 వ సచివాలయ పరిధి
నందు జరిగిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి
రమాదేవి వెంకట్రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. సంక్షేమ ప్రభుత్వంపై
ప్రతిపక్షాలు సాగిస్తున్న కుట్రలను, విషప్రచారాన్ని ప్రజాక్షేత్రంలో
తిప్పికొడుతూ సచివాలయ కన్వీనర్లు, గృహసారథులతో కలిసి ముందుకు సాగారు. ‘మా
నమ్మకం నువ్వే జగన్’ స్టిక్కర్లను లబ్ధిదారుల ఇళ్ల గోడలు, తలుపులపై అంటించి
ప్రజామద్దతు కోరారు. ఈ సందర్భంగా గత టీడీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలు,
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన వైనాన్ని ప్రజలకు వివరించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో
అమలు చేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఇంటి
ముంగిటకే సంక్షేమ ఫలాలు అందిస్తుండడంతో ‘జగనన్నే మా భవిష్యత్తు’ అంటూ ప్రజలు
ముఖ్యమంత్రికి నీరాజనాలు పలుకుతున్నారన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ సైకోలే
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనలో రాష్ట్రంలో సంతోషంగా లేని వ్యక్తులు
ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు, నారా లోకేష్ లని మల్లాది విష్ణు
విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ పై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఈ
సందర్భంగా ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ సైకోలేనని, సైకో
ఇజంతో ఆనాడు చంద్రబాబు ఎన్టీఆర్ పదవిని లాక్కున్నారన్నారు. సీఎం జగన్ గూర్చి
మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకి ఏమాత్రం లేదని, అపవిత్ర కలయికతో వచ్చిన ఒక్క
ఎమ్మెల్సీ స్థానాన్ని చూసుకుని చంద్రబాబు విర్రవీగుతున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రానికి పట్టిన నిజమైన దరిద్రం చంద్రబాబేనని, ఆ దరిద్రాన్ని 2019లోనే
ప్రజలు ఛీ కొట్టి వదిలించుకున్నా, తండ్రికొడుకులకు బుద్ధి రాలేదని
విమర్శించారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను నమ్మించవచ్చనే భ్రమలో
చంద్రబాబు, లోకేష్ ఉన్నారని నిప్పులు చెరిగారు.
చంద్రబాబుది భస్మాసుర హస్తం
ఉమ్మడి కృష్ణా జిల్లా విషయంలో చంద్రబాబుది భస్మాసుర హస్తమని మల్లాది విష్ణు
విమర్శించారు. అమరావతిని నెత్తిన పెట్టుకుని.. ఉమ్మడి కృష్ణా జిల్లాను
పూర్తిగా నిర్లక్ష్యం చేసిన బాబుకు ఈ ప్రాంతంలో పర్యటించే నైతిక హక్కు
లేదన్నారు. చంద్రబాబు టూర్ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిందని పేర్కొన్నారు.
కేవలం ఉనికి కోసం బాబు చేస్తున్న పర్యటనకు ఎక్కడా ప్రజామద్ధతు లభించడం
లేదన్నారు. దీంతో చివరకు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ..
ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మాటల్లో
అభద్రతాభావం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ ప్రభుత్వం గూర్చి మాట్లాడే నైతిక
అర్హత చంద్రబాబుకు ఏమాత్రం లేదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. రెండు కళ్ళ
సిద్ధాంతంతో రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టింది మొదలు కుళ్లిపోయిన
సిద్ధాంతాలతో గత ఐదేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రాన్ని అంధకారంలోకి పడదోశారని
మండిపడ్డారు. ప్యాకేజీ తీసుకుని ప్రత్యేక హోదాను సమాధి చేశారని దుయ్యబట్టారు.
సింగపూర్, మలేషియా, జపాన్ పర్యటనలంటూ గాలిలోనే తిరిగారు తప్ప పేదల జీవన
స్థితిగతులలో మార్పు తీసుకువచ్చే ఏ ఒక్క కార్యక్రమాన్ని అయినా చంద్రబాబు
ప్రవేశపెట్టారా..? జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు.
పట్టిసీమ ప్రాజెక్టు చంద్రబాబు అవినీతికి పరాకాష్ట అని మల్లాది విష్ణు
విమర్శించారు. కేవలం కాసులు పండించుకోవడానికి తాత్కాలిక పట్టిసీమను బాబు
ప్రభుత్వం పూర్తి చేసిందని గుర్తుచేశారు. అలాగే రాష్ట్రంపై, పేద ప్రజలపై
చంద్రబాబు అభిప్రాయం ఏవిధంగా ఉందో ఆయన రాసుకున్న ఆత్మకథ చదివితేనే
అర్థమైపోతోందన్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమర్థవంతమైన
నాయకత్వంలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని మల్లాది విష్ణు చెప్పారు. 2024లో
మరోసారి సీఎం జగన్ కు పట్టం కట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని
స్పష్టం చేశారు. కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ నాలం బాబు, కన్వీనర్లు
ఆర్.ఎస్.నాయుడు, నాగమణి, విన్నకోట వెంకటేశ్వరరావు, నాయకులు నీలాపు
దుర్గాప్రసాద్ రెడ్డి, మీసాల సత్యనారాయణ, బాలనాగమ్మ, పద్మావతి, కళ్యాణి,
రాజ్యలక్ష్మి, సీహెచ్ సుబ్బారావు, గృహ సారథులు పాల్గొన్నారు.