వీరభద్రస్వామి
నగరంలో అంబేడ్కర్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ
విజయనగరం : భారతరత్న డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆశయాల మేరకు సమసమాజ
స్థాపనే ధ్యేయంగా మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర
ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స
సత్యనారాయణ అన్నారు. ఆ మహనీయుని ఆశయ సిద్ది కోసం పునరంకితమవుతామని
చెప్పారు. భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా
నగరంలోని పూర్వపు బాలాజీ జంక్షన్ వద్ద పాత విగ్రహం స్థానంలో కొత్తగా
నగర పాలకసంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా.అంబేడ్కర్ కాంస్య
విగ్రహాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల
వీరభద్ర స్వామితో కలసి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ దేశంలోని
అన్ని మతాలు, కులాలు, జాతుల వారికి సమాన హక్కులు వుండాలని పేర్కొంటూ
వాటిని రాజ్యాంగంలో పొందుపరచి తద్వారా సమసమాజ స్థాపనకు కృషిచేసిన
గొప్పవ్యక్తి డా.అంబేడ్కర్ అని పేర్కొన్నారు. ఉప సభాపతి కోలగట్ల
వీరభద్రస్వామి మాట్లాడుతూ భారతీయులంతా నేడు సగర్వంగా డా.అంబేడ్కర్
జయంతిని జరుపుకుంటున్నారంటే అందుకు కారణం ఆయన తన రాజ్యాంగం ద్వారా
కల్పించిన హక్కులేనని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి
ఒక్కరూ తమవంతుగా కృషిచేయాల్సి ఉందన్నారు.
నగరంలో కూడళ్ల సుందరీకరణలో భాగంగా బాలాజీ కూడలిని డా.అంబేడ్కర్
కూడలిగా నామకరణం చేసి అభివృద్ధి చేస్తున్నామని, దీనిలో భాగంగా కాంస్య
విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే మహిళా పార్కును కూడా
ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చినప్పల
నాయుడు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్
దీపిక, నగర మేయర్ వి.విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల
శ్రావణి, రేవతి, కమిషనర్ శ్రీరాములు నాయుడు, ఆర్.డి.ఓ. ఎం.వి.సూర్యకళ
తదితరులు పాల్గొన్నారు.