తృణధాన్యాలు సాగుచేసే రైతులకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం కల్పించండి
అన్ని పట్టణాల్లో తృణధాన్యాల ఉత్పత్తుల స్టాల్స్ ను ఏర్పాటు చేయండి
తృణధాన్యాల ప్రోసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేవారికి తోడ్పాటునివ్వండి
స్వయం సహాయక సంఘాలను పెద్దఎత్తున భాగస్వాములను చేయాలి
రాష్ట్ర సచివాలయంలో తృణధాన్య పదార్ధాల ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయండి
ఆరోగ్యంగా ఉండాలంటే తృణధాన్యాల వినియోగం తప్పనిసరి
ఇకపై ప్రతినెల తృణధాన్యాలపై రాష్ట్ర స్థాయిలో సమీక్ష
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి
వెలగపూడి : రాష్ట్ర వ్యాప్తంగా తృణధాన్యాల వినియోగంపై ప్రజల్లో పెద్దఎత్తున
అవగాహనను పెంపొందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.
జవహర్ రెడ్డి అన్నారు. ఐక్యరాజ్య సమితి 2023 ఏడాదిని అంతర్జాతీయ మిల్లెట్స్
సంవత్సరంగా ప్రకటించిన నేపధ్యంలో ఈఅంశంపై గురువారం వెలగపూడి సచివాలయంలో
వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సిఎస్ సమీక్షించారు. ఈసందర్బంగా ఆయన
మాట్లాడుతూ తృణధాన్యాల సాగుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అనుకూలమైనదని
రాష్ట్రంలో ఈఏడాది లక్షా 27వేల హెక్టార్లలో తృణధాన్యాలను సాగుచేయాలని
లక్ష్యంగా నిర్దేశించినట్టు తెలిపారు.
తృణధాన్యాలు సాగుచేసే రైతులకు ప్రభుత్వపరంగా తగిన మద్ధత్తు ధరను ఇచ్చి
ప్రోత్సహించడంతోపాటు ఆయా ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు
చర్యలు తీసుకోవాలని వ్యవసాయ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అదే విధంగా
తృణధాన్యాల ప్రోసెసింగ్ యూనిట్లు నెలకొల్పే వారికి తగిన విధంగా
ప్రోత్సాహాకాలను అందించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లు,
మున్సిపాలిటీలు తదితర పట్టణాలన్నిటిలో తృణ ధాన్యాలకు సంబంధించిన స్టాల్స్ ను
ఏర్పాటు చేసి ఆయా ఉత్పత్తులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సూచించారు. అలాగే
మహిళా సంఘాల ద్వారా తృణ ధాన్యాల ఉత్పత్తుల విక్రయానికి మహిళా మార్టుల పేరిట
అమ్మకాలను ప్రోత్సహించాలని సెర్ప్ సిఇఓను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.
రాష్ట్ర సచివాలయంలో తృణధాన్యాల ఉత్పత్తులకు సంబంధించిన ప్రత్యేక స్టాల్ ను
ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదిని సిఎస్
ఆదేశించారు. అదే విధంగా సచివాలయంలో జరిగే వివిధ సమావేశాల్లో తృణదాన్యాలతో
తయారు చేసిన స్నాక్స్ ను అందించేందుకు ప్రోటోకాల్ విభాగానికి ఆదేశాలు జారీ
చేయనున్నట్టు చెప్పారు. జిల్లాల్లో తృణధాన్యాలను పెద్దఎత్తున
ప్రోత్సహించేందుకు జిల్లా కలక్టర్లను సర్కులర్ జారీ చేయనున్నట్టు సిఎస్
పేర్కొన్నారు. ఇకపై ప్రతి నెల తృణధాన్యాలపై రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ,
అనుబంధరంగాల అధికారులతో సమీక్షించనున్నట్టు సిఎస్ స్పష్టం చేశారు. జిల్లా
స్థాయిలో జెసి,వ్యవసాయశాఖ జెడి, రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో సమావేశం
నిర్వహించి పెద్దఎత్తున తృణధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కృషి చేయాలని
సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. జొన్నలు, సజ్జలు, రాగులు వంటి తృణధాన్యాల్లోని
పిండి పదార్ధాల వల్ల దైనందిన అవసరాలకు సరిపడా 70-80శాతం శక్తిని అందిస్తాయని,
భారీ పరిమాణాల్లో వినియోగిస్తుంటే ఇవి ఇతర పోషకపదార్ధాలైన మాంసకృత్తులు,
కాల్షియం, ఐరన్ , బి కాంప్లెక్స్ విటమిన్లను కూడా అందజేస్తాయని సిఎస్
డా.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రస్తుత సమాజంలో గుండె జబ్బులు,చక్కెర వ్యాధి,బిపి వంటి జబ్బులు పెరుగుతున్న
నేపధ్యంలో ప్రతి నిత్యం మన ఆహారములో రాగులు, జొన్నలు, సజ్జలు ఉండటం మంచిదని
ఆయన పేర్కొన్నారు. ఇవి మంచి ఖనిజాలను, పీచును బాగా కలిగి ఉంటాయని రాగుల్లో
ఖనిజాలు ముఖ్యంగా కాల్షియం అధికంగా ఉంటుందని మూత్ర రోగాలను అరికడుతాయని
దేహపుష్టిని కలిగిస్తాయని సిఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. తృణధాన్యాలతో సంపూర్ణ
ఆరోగ్యాన్ని పొందవచ్చని వైద్యులు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారని సిఎస్
పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం మనం తీసుకునే ఆహారంలో
తృణధాన్యాలను వినియోగించుకోవడం అలవర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సిఎస్
జవహర్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.
అంతకు ముందు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పవర్ పాయింట్
ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో తృణధాన్యాల సాగు ప్రోత్సాహానికి తీసుకుంటున్న
చర్యలను వివరించారు. 2022-23లో లక్షా 27వేల హెకార్లు,2023-24లో లక్షా 47వేల
హెక్టార్లలో తృణధాన్యాలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు
తెలిపారు. ముఖ్యంగా రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు తదితర తృణధాన్యాలను
పండించే విధంగా రైతులను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు చర్యలు
తీసుకుంటున్నట్టు వివరించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమీషనర్ హెచ్.అరుణ్
కుమార్ మాట్లాడుతూ పౌర పంపిణీ విధానం ద్వారా ప్రజలకు సరఫరాకు రాగులు 9వేల 145
మెట్రిక్ టన్నులు,జొన్నలు 4వేల 303 మెట్రిక్ టన్నులు అవసరం ఉందని చెప్పారు.
దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్న సెర్ప్ సిఇఓ ఇంతియాజ్ మాట్లాడుతూ స్వయం సహాయ
సంఘాల మహిళలు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తృణధాన్యాల వినియోగ ఆవశ్యకతపై
ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇప్పటికే 52 మిల్లెట్ ఫెస్ట్స్ అండ్
ఎగ్జిబిషన్లను నిర్వహించినట్టు తెలిపారు.
అనంతపురం, ప్రకాశం, బాపట్ల, ఎన్టిఆర్, విజయనగరం, ఎఎస్ఆర్ జిల్లాల్లో రెడీటు
ఈట్ అండ్ రడీ టు కుక్ ఆధారిత ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పడం జరిగిందని
చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండి
వీరపాండ్యన్,మధ్యాహ్నభోజన పథకం డైరెక్టర్,ఆహారశుద్ధి విభాగం సిఇఓ తదితర
విభాగాల అధికారులు పాల్గొన్నారు.