ఉత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నాం : ఇ.ఓ సుధారాణి
విజయనగరం : ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం
మే 1వ తేదీన నిర్వహించి ఆ రోజున అమ్మవారిని వనం గుడి నుండి చదురుగుడికి తీసుకు
వచ్చే కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ
కార్యనిర్వహణ అధికారి కె.ఎల్.సుధారాణి వెల్లడించారు. ఆలయ పూజారి బంటుపల్లి
వెంకటరావు, ట్రస్టు బోర్డు సభ్యులతో కలిసి అమ్మవారి కళ్యాణ మంటపంలో బుధవారం
ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను తెలిపారు. మే1న
సాయంత్రం 4 గంటలకు ఆలయ సంప్రదాయాల ప్రకారం వనం గుడి నుండి అమ్మవారు బయలుదేరి
హుకుంపేటలో గల ఆలయ పూజారి ఇంటికి చేరుకుంటారని, రాత్రి 10 గంటలకు అక్కడ నుంచి
బయలుదేరి 2వ తేదీ ఉదయం 6-30 గంటలకు మూడు లాంతర్లు వద్ద నున్న చదురు గుడికి
చేరుకుంటారని తెలిపారు. దేవర ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు
ట్రస్టు బోర్డు సభ్యులతో కలిసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ
ఉత్సవంలో భక్తులంతా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు
పొందాలని పేర్కొన్నారు. ఈ ఉత్సవానికి సంబందించి ఆలయ తలయారీ ద్వారా ఈ నెల 24న
చాటింపు వేయిస్తున్నామని చెప్పారు. ఈ పత్రికా సమావేశంలో ట్రస్టు బోర్డు
సభ్యులు పతివాడ వెంకట రావు, ఎం.కే.బి శ్రీనివాస రావు, బలివాడ పార్వతి, గంధం
లావణ్య, ఎస్.అచ్చి రెడ్డి, చిల్లా పుష్ప తదితరులు పాల్గొన్నారు.