అమరావతి : “జగనన్నే మా భవిష్యత్” కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల
నుంచి విశేష స్పందన లభిస్తోందని మా నమ్మకం నువ్వే జగన్ అంటూ 8296082960 నంబర్
కు మొదటి మూడు రోజుల్లోనే 20 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ నమోదు కావడం జగన్
పాలన పై ప్రజల నమ్మకాన్ని అద్దం పడుతోందని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ
ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా
ఆయన పలు అంశాలపై స్పందించారు. కార్యక్రమానికి ప్రజల్లో రోజురోజుకు మరింతలా
ఆదరణ పెరుగుతోందని, ప్రజా సర్వే లో జగన్ పాలనపై ప్రజలు తమ సంతృప్తిని పెద్ద
ఎత్తున వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టోఫెల్ శిక్షణ
విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలతో దేశంలో తనకంటూ ప్రత్యేక మార్కును సొంతం
చేసుకున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి ప్రభుత్వ
పాఠశాల విద్యార్థులకు టోఫెల్ పరీక్షలకు శిక్షణ అందించేలా చర్యలు
చేపడుతున్నారని విజయసాయి రెడ్డి తెలిపారు దీంతో అంతర్జాతీయ వేదికపై
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తమ సత్తా చాటనున్నారని అన్నారు.
విప్లవాత్మక సంస్కరణలు చేపట్టడంతో పాటు ప్రతి దశలోనూ ప్రభుత్వం చదువులకు అండగా
ఉంటోందని అన్నారు.
స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ లో ఏపీ టాప్
స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2021-22 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే
అగ్రగామిగా నిలిచిందని విజయసాయిరెడ్డి తెలిపారు. ఎస్ఈఈఐ 2021-22లో
ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలు 60 పాయింట్లతో
లీడింగ్ కేటగిరీలో ఉన్నాయని అన్నారు. ఎస్ఈఈఐ రిపోర్టు ప్రకారం కర్నాటన,
ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛండీగర్ లు ఆయా రాష్ట్రాల గ్రూపుల్లో అత్యుత్తమ
ప్రదర్శన కనబర్చాయని అన్నారు. గత సూచిక తో పోల్చితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
రాష్ట్రాలు అత్యుత్తమ ప్రగతి కనబర్చాయని ఆయన అన్నారు.