బీసీలకు కారణ జన్ముడు జగనన్న
సమాజంలోని అసమానతలు, రుగ్మతలపై పోరాడిన యోధుడు పూలే
జగనన్న పాలనలో మహిళలకు పెద్దపీట
పూలే ఆశయాలను, ఆలోచనలను అమలు చేస్తున్న జగనన్న ప్రభుత్వం
బీసీ సంక్షేమ శాఖ, సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస
వేణుగోపాల కృష్ణ
విజయవాడ : జన గణనలో కుల గణన చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
బీసీ కులగణనకు కార్యాచరణ స్టడీ కమిటీ వేయటం ముదావహం అని ఆంధ్రప్రదేశ్
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన
శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల
సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత సామాజిక విప్లవోద్యమ పిత మహాత్మా జ్యోతిబా పూలే
197వ రాష్ట్ర స్థాయి జయంతి మహోత్సవ వేడుకలను విజయవాడలోని తుమ్మలపల్లి వారి
క్షేత్రయ్య కళాక్షేత్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిబా పూలే
జయంతి వేడుకల్లో భాగంగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు కళాక్షేత్రం
వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం
కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన పూలే విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన
చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పూలే జయంతి వేడుకల సభకు సభాధ్యక్షులుగా విజయవాడ
సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ వ్యవరించారు. ఈ సందర్భంగా ముఖ్య
అతిథిగా హజరైన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి
చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలు 139
కులాలు ఉన్నా వారి సంఖ్య తెలియని పరిస్థితి నెలకొని ఉందని, బీసీ సంఘాల
ఆభ్యర్ధన మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జనగణనలో బీసీ కులగణన చేయాలని
సంకల్పించి బీసీ మంత్రిగా ఆ బాధ్యతను నాపై ఉంచారని, బీసీ కులగణనకు అవసరమైన
కార్యాచరణ స్టడీ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. స్టడీ కమిటీ సభ్యులు కులగణన
చేపడుతున్న ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి అధ్యయనం చేస్తారన్నారు. బీసీలు
వెన్నెముకగా నిలవాలన్న ఆలోచన చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి బీసీలకు కారణ
జన్ముడని కొనియాడారు. పుట్టిన వారు సంఘంలో పేరు ప్రఖ్యాతలు సాధించాలంటే విద్య
ఒక ఆయుధం అని, ప్రతి ఒక్కరికి విద్య అందాలని కడుపులో బిడ్డ నుంచి ఉన్నత చదువుల
వరకు యువతకు వివిద దశల్లో అనేక పథకాలతో జగనన్న అండగా నిలుస్తున్నాడని, అమ్మ
ఒడి నుంచి విదేశీ విద్యాదీవెన వరకు పేద వారి చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక
ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని అన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి
2017లో ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం బడుగు, బలహీన వర్గాలు ఉన్నత
చదువులు అంది పుచ్చుకోవటానికి కారణమైందన్నారు. గత ప్రభుత్వాలు కేవలం ఎన్నికల
హామీల వరకే బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతిపై మాట్లాడే వారని, కేవలం మహానేత
మాత్రమే చేతల ద్వారా చూపించాడని కొనియాడారు. చదువుల తల్లి సరస్వతి ఎలాగో నేటి
విద్యార్థినీలకు సావిత్రీభాయి అలా పూజ్యనీయురాలని, రెండు శతాబ్ధాల క్రితమే
నాటి పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచి బాలికావిద్యకు నాంది పలికారని
గుర్తుచేశారు. నాటి కాలంలో పురుష సమాజంలో స్త్రీ వివక్షపై సమాధి కట్టింది
మహాత్మా పూలే అని అన్నారు. పూలే ఆశయ సాధనకు యువత నడుం బిగించాలని
పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా బిసి, ఎస్సి, ఎస్టిలకు
పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమే అని, 25 మంది ఉన్న
మంత్రివర్గంలో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు స్థానం కల్పించటమే కాకుండా
స్థానిక సంస్థల్లో, నామినేటడ్ పదవుల్లో సైతం 50 నుంచి 70 శాతంకు పైగా మహిళలకు
కేటాయించటం జగనన్నకే సాధ్యమైందన్నారు.
గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ దేశంలో పూలే ఆశయాలను, ఆలోచనను
పూర్తిగా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని అన్నారు. అభినవ
పూలే జగన్ అన్న అని కొనియాడారు. 197 సంవత్సరాల క్రితం బడుగు, బలహీన వర్గాల
అభ్యున్నతి కోసం ఉదయించిన వెలుగు కిరణం పూలే అని అభివర్ణించారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో
సామాజిక అసమానతలను తొలగించి పాలన చేస్తుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని
అన్నారు. ప్రతి విద్యార్థి చదువు మద్యలో ఆపకుండా ఉన్నత చదువులు చదవాలని
సంకల్పం చేసుకోవాలన్నారు.
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ మాట్లాడుతూ పూలే
కలలను సాకారం చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వేస్తున్న అడుగులు
దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శనీయమన్నారు. బడ్జెట్ లో సైతం బీసీల ఉన్నతికి
అగ్రభాగాన నిధులు కేటాయింపులు చేయటమే ఇందుకు నిదర్శనమన్నారు.
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బీసీ పక్షపాతి సీఎం జగనన్న
అన్నారు. విద్యతో సమాజంలో సంస్కరణలు తీసుకురావాలని యువతకు పిలుపునిచ్చారు. దేశ
చరిత్రలో వెనుకబడిన తరగతులు వెన్నెముక కలిగిన తరగతులుగా తీసుకురావటంలో జగనన్న
ఆదర్శంగా నిలుస్తాడన్నారు.
ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ విద్య పదునైన ఆయుధమని, ప్రతి ఒక్కరూ విద్య అనే
ఆయుధాన్ని కలిగి ఉంటే సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని సూచించారు. అందుకనే
జగనన్న నాడు-నేడు పథకంలో భాగంగా పాఠశాలలను బలోపేతం చేస్తున్నారని, దీంతో
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలు
నిలిచాయన్నారు. పూలే కలలు కన్న సమాజం మన రాష్ట్రం నుంచే ప్రారంభమవుతుందని,
ఇందుకు జగనన్న తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలే నిదర్శనమన్నారు.
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ సమాజంలో నెలకొన్న రుగ్మతలు, అసమానతలను
తొలగించిన మహోన్నత వ్యక్తి మహాత్మా పూలే అని కొనియాడారు. నాటి సమాజంలో స్త్రీ
జాతిని నిర్వీర్యం చేసే పరిస్థితులు ఉండేవని, వంటింటికే పరిమితం చేసే
కట్టుబాట్లను ఎదిరించి పోరాడిన ధీరుడు పూలే అన్నారు. విజయవాడ మున్సిపల్
కార్పొరేషన్ ఛైర్ పర్సన్ రాయన భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ జగనన్న పాలనలో మహిళలకు
పెద్దపీట వేశారని, మహిళలు విద్యావంతులైతే ఆ కుటుంబం, అలాగే ఆ రాష్ట్రం
ముందడుగు వేస్తుందన్నారు. జగనన్న పాలనలో మహిళా సాధికారత, ఉద్దరణ జరుగుతుందని
వివరించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాలికా విద్యను
ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు.
ముందుగా సత్తెనపల్లి, మోపిదేవి మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్సియల్ స్కూల్
విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు
ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సభానంతరం మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస
వేణుగోపాల కృష్ణ, జోగి రమేష్ లను నిర్వాహకులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా
సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ పి. గౌతమ్
రెడ్డి, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ తోలేటి శ్రీకాంత్, గౌడ కార్పొరేషన్
ఛైర్మన్ యం. శివరామకృష్ణ, ఇండస్ట్రీయల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్
బండి శివశక్తి పుణ్యశీల, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్ పర్సన్ టి. జమల పూర్ణమ్మ,
పడమట స్నిగ్ధ, తన్నేరు నాగేశ్వరరావు, సంపత్ విజేత, అవుతు శ్రీ శైలజా రెడ్డి,
మామిడి శ్రీకాంత్, జింకా విజయ లక్ష్మీ, బీరక సురేంద్రబాబు, శెట్టి
అనంతలక్ష్మీ, వై. రుద్ర గౌడ్, పిల్లి సుజాత, ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ల
సమన్వయకర్త ఎ. ప్రవీణ్, వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
జి. జయలక్ష్మీ, ఎన్టీయార్ జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీరావు, వెనుకబడిన
తరగతులు సంక్షేమ శాఖ డైరక్టర్ పి. అర్జున రావు వివిద శాఖాధిపతులు, అధికారులు
పాల్గొన్నారు.