పార్వతీపురం : ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించడంతోపాటు విద్యార్థుల్లో ఆహార
లోపం తలెత్తకుండా పోషక విలువలు పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని
రాష్ట్ర ఆహార కమీషన్ సభ్యులు బి.కాంతారావు అన్నారు. పట్టణంలో పర్యటించి
స్థానిక సంకావీది అంగన్వాడీ కేంద్రం, జిల్లా పరిషత్ సంస్కృతోన్నత పాఠశాల,
గ్రామ సచివాలయాన్ని మంగళవారం పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో జగనన్న
గోరుముద్ధ పధకం అమలును, సరుకుల నిల్వ రికార్డుల నిర్వహణ ను క్షుణ్ణంగా తనిఖీ
నిర్వహించారు. వండిన వంటకాల స్వయంగా రుచి చూసి నాణ్యతను పరిశీలించారు.
రికార్డులు నిర్వహణ సక్రమంగా లేకపోవడాన్ని గమనించి సంబంధిత అంగన్వాడీ
కార్యకర్తలకు మెమోలు జారీ చేయాలని ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ అధికారి బి.
శ్రీనివాస రావు ను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ను సక్రమంగా అమలు
చేయాలని అన్నారు. కేంద్రంలోని చిన్నారులు చీకటిలో ఉండడాన్ని చూసి కారణాలను
ప్రశ్నించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ లేదని తెలపగా ఇటువంటివి మరలా
పునరావృతం కాకూడదని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని
హెచ్చరించారు. ఎంత మంది గర్భిణీలకు పౌష్ఠికాహారం అందిస్తున్నది వివరాలను ఆరా
తీశారు. రక్తహీనత లోపం తలెత్తకుండా బలవర్ధకమైన ఆహారాన్ని సక్రమంగా అందించాలని
సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్
రెడ్డి కి విద్యా రంగం అంటే అమితమైన ప్రేమ ఉందన్నారు. పేద వర్గాల పిల్లలు
విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా
దీవెన వంటి బృహత్తర పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. పథకాల అమలు క్షేత్ర
స్థాయిలో పక్కాగా అమలు జరిగేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
లోపాలను సరిదిద్దుకుని ప్రభుత్వ ఆశయం నెరవేర్చేందుకు పథకాలను సమర్థవంతంగా అమలు
చేయాలని కోరారు. జిల్లా పరిషత్ సంస్కృతోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం
అమలు ను, స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని
సందర్శించారు. అంతకుముందు జగన్నాథ పురం లోని ఎర్ర కంచమ్మ గ్రామ దేవత ను
దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి
కె.వి.ఎల్.ఎన్.మూర్తి, ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేతీరెడ్డి విజయ
గౌరీ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి పి.సూర్యనారాయణ, జీసిసి డివిజనల్
మేనేజర్ వి. మహేంద్ర కుమార్, విద్యా శాఖ సహాయ సంచాలకులు రామ జ్యోతి, సీతానగరం
మండల విద్యాధికారి సూర్య దేముడు, ఆహార భద్రత అధికారి పోడూరి వెంకట రమణ, కొమరాడ
సి డి పి ఒ జీ.సుగుణ కుమారి, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు
ఏ.శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.