276 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి రాష్ట్రంలో ఏ ఒక్క
రాజకీయ పార్టీకి లేదని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే
మల్లాది విష్ణు తెలిపారు. సోమవారం 63 వ డివిజన్ 276 వ వార్డు సచివాలయ పరిధి
రాధానగర్‌లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్
అవుతు శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి ఆయన
పాల్గొన్నారు. ప్రజలను నేరుగా కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ
పథకాల కరపత్రాలను అందజేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. ప్రభుత్వ పథకాలను
వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో గడిచిన నాలుగేళ్లుగా అమలు
చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకే గడప
గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మల్లాది విష్ణు
చెప్పారు. ఏ ఒక్క కుటుంబానికి కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో
నవరత్నాలతో పథకాలను రూపొందించి పేదరిక నిర్మూలన దిశగా ముందుకు
సాగుతున్నారన్నారు. అలాగే 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న భూములను డీనోటిఫై
చేయాలని నిర్ణయించడంతో నున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని కండ్రిక,
ఎన్.ఎస్.సి.బోస్ నగర్, పాయకాపురం పరిసర ప్రాంతాలలో పెండింగ్ లో ఉన్న వేలాది
అర్జీలకు పరిష్కారం లభించనున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు.
నాలుగేళ్లలో ఎంతో లబ్ధి చేకూరిందని ప్రజల హర్షం
సీఎం జగన్ లేకపోయుంటే తమ పరిస్థితి దయనీయంగా ఉండేదని ఈ సందర్భంగా పలువురు
లబ్ధిదారులు తెలిపారు. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, పింఛన్ కానుక,
వైఎస్సార్ ఆరోగ్య ఆసరా, సున్నావడ్డీ (డ్వాక్రా), వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాలు
తమ కుటుంబ బతుకు చిత్రాన్ని మార్చివేశాయని లబ్ధిదారు పిణ్ణరల అమ్ములు
వెల్లడించారు. గత మూడున్నరేళ్లలో రూ. 9 లక్షల 98 వేల 934 రూపాయల సంక్షేమం
అందినట్లు మరో లబ్ధిదారు నాగమలే సావిత్రి చెప్పారు. బుడే సుభాని అనే
వృద్ధునికి ఎమ్మెల్యే చేతులమీదుగా ట్రై సైకిల్ అందజేయడంతో తాత ఆనందానికి
అవథుల్లేవు. అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు.
కడుపుమంటతో చంద్రబాబు, టీడీపీ విష ప్రచారాలు
సీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలోని 85–87 శాతం కుటుంబాలకు
లబ్ధి చేకూర్చడం జరిగిందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
తెలిపారు. తెలుగుదేశం పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యమని విమర్శించారు. వైఎస్
జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, చేయూత తదితర
పథకాలు అందించడంతోపాటు నాడు–నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు, ఆస్పత్రులు,
రోడ్లను అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని
పారిశ్రామికంగా పరుగులు పెట్టిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కనుకనే జగనన్నే మా
భవిష్యత్తు అని ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారని వెల్లడించారు. జగనన్న
కాలనీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అక్షరాల 32 లక్షల మందికి ఆడపడుచులకు ఈ
ప్రభుత్వం ఇళ్ల పట్టాలు అందించిందని, సీఎం జగన్ ఒకే ఒక్క నిర్ణయంతో 78 లక్షల
మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు నాలుగు విడతలలో రూ. 26 వేల కోట్ల రుణమాఫీ
చేయడం జరిగిందన్నారు. కాబట్టే ‘మా నమ్మకం నువ్వే జగన్’ అన్నది ప్రజల గుండె
చప్పుడుగా మారిపోయిందన్నారు. కానీ ప్రజల కోసం చేసిన ఒక్క పని కూడా
చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని మల్లాది విష్ణు విమర్శించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పనితీరుకు
ప్రజలు ఆకర్షితులవుతుంటే చంద్రబాబు, ఎల్లోమీడియా ఓర్వలేక కడుపుమంటతో విషపూరిత
ప్రచారాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఆఘమేఘాల మీద తెలుగుదేశం పార్టీ
విడుదల చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా ‘మా నమ్మకం
నువ్వే జగన్’ స్టిక్కర్లను తమ ఇళ్లకు తగిలించుకుంటుంటే పచ్చ నేతలకు ఎందుకంత
ఏడుపని ధ్వజమెత్తారు. టీడీపీ శ్రేణులు స్టిక్కర్లు తొలగించినంత మాత్రాన వారి
గుండెల్లో జగనన్న ముద్రను చెరపలేరని పేర్కొన్నారు. ఇకనైనా పిచ్చి చర్యలను
మానుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఈఈ
(ఇంజనీరింగ్) శ్రీనివాస్, డీఈ (వాటర్ సప్లై) రామకృష్ణ, ఏఈ అరుణ్ కుమార్, సీడీఓ
జగదీశ్వరి, డివిజన్ కోఆర్డినేటర్ పసుపులేటి యేసు, నాయకులు మోదుగుల గణేష్,
సీహెచ్ రవి, నాగు, ఉద్ధంటి శ్రీను, సామ్రాజ్యం, వీర్ల శ్రీను, అన్ని శాఖల
అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.