అధికారులపై దాడి చేసిన అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి
అక్రమ రేషన్ దందాపై లోతైన విచారణ చేపట్టాలి
తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి డిమాండ్
బాపట్ల : పర్చూరు నియోజకవర్గంలో రేషన్ బియ్యం మాఫియాపై ఉక్కు పాదం మోపి,కట్టడి
చేయాలని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి
సాంబశివరావు డిమాండ్ చేశారు. సోమవారం స్వర్ణ గ్రామంలో అక్రమ రేషన్ దందాపై
విజిలెన్స్ అధికారులు తనిఖీలు నేపథ్యంలో వారిపై కొందరు అక్రమార్కులు
దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆయన స్పందించారు. కారంచేడు మండల
పరిధిలోని స్వర్ణ కేంద్రంగా అక్రమ రేషన్ మాఫియా దందా కొనసాగుతుందన్నారు.
అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు ఈ అక్రమ దందాలో ప్రధాన
సూత్రధారులుగా వ్యవహరించడం, తనిఖీలకు వచ్చిన అధికారులపై దాడులు చేయడం దారుణం
అన్నారు. పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ బియ్యం
వ్యవస్థను అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధుల గల్లా పెట్టెలు
నింపేందుకు ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ
అధికారులపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ అక్రమ రేషన్ బియ్యం వ్యాపారంతో
నెల నెల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని, అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా
ప్రతినిధి ప్రధాన సూత్రధారుడిగా ఈతతంగాన్ని గోప్యంగా నడిపిస్తున్నాడన్నారు.
స్వర్ణ గ్రామంలో సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రైస్
మిల్లులో దాడులు నిర్వహించేందుకు రాగా వారిపై దాడికి దిగిన సంఘటన మీడియాలో
రచ్చయ్యాయన్నారు. గతంలోనూ ఈ రైస్ మిల్లు పై అనేకసార్లు అధికారులు దాడులు
నిర్వహించగా పలు మార్లు రేషన్ బియ్యం పట్టుబడటం జరిగిందన్నారు. అధికార పార్టీ
నేతల ఒత్తిడికి తలొగ్గి నామమాత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారని, ఈ
కేసుల్లో అసలు పాత్రధారుని వదిలి గుమస్తాలపై తూతూ మంత్రంగా కేసులు నమోదు చేయడం
సరికాదన్నారు. స్వర్ణలో అధికారులపై ఆ ప్రజాప్రతినిధి అనుచరులు దౌర్జన్యానికి
దిగి దాడి చేసి, అధికారుల సెల్ ఫోన్లు సైతం ధ్వంసం చేయడం హేయమైన చర్య అన్నారు.
తనిఖీ వచ్చిన అధికారులపై దాడికి దిగడంతో అధికారులు ఆత్మవిశ్వాసాన్ని
దెబ్బతీస్తున్నారని, తక్షణమే స్పందించి ఉన్నతాధికారులతో ఈ విషయంపై సమగ్ర
దర్యాప్తు చేపట్టాలన్నారు. అక్రమరేషన్ బియ్యం మాఫియాకు పాల్పడుతున్న ఆ ప్రజా
ప్రతినిధిపై పీడీ యాక్ట్ నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.