గుర్తున్నాడా? ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఉత్తర్‌ప్రదేశ్‌లో భారత్-నేపాల్
సరిహద్దులోని దుధ్వా-కటార్నియా అటవీ ప్రాంతంలో ‘మోగ్లీ’ పేరుతో రెండు పాఠశాలలు
నడుస్తున్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహరాయిచ్ అటవీ ప్రాంతంలో ఏర్పాటు
బహరాయిచ్: అప్పుడెప్పుడో వచ్చిన జంగిల్‌బుక్ సినిమా చూశారా? అందులోని
‘మోగ్లీ’ గుర్తున్నాడా? ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఉత్తర్‌ప్రదేశ్‌లో
భారత్-నేపాల్ సరిహద్దులోని దుధ్వా- కటార్నియా అటవీ ప్రాంతంలో ‘మోగ్లీ’
పేరుతో రెండు పాఠశాలలు నడుస్తున్నాయి. వాటిల్లో గిరిపుత్రుల సంతానానికి
విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. రక్షిత అటవీ ప్రాంతంలోని బార్దా, మోతిపుర్
ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన మోగ్లీ పాఠశాలల్లో 350 మంది చిన్నారులు
చదువుకుంటున్నారు. వీరి వయసు ఏడు నుంచి 10 సంవత్సరాల్లోపు ఉండడం గమనార్హం.
వీరిలో చాలా మంది అణగారిన, పేద కుటుంబాలకు చెందినవారు. పగలు చిన్నారులంతా
వ్యవసాయ క్షేత్రాల్లో తల్లిదండ్రులకు సహకరించేవారు. సాయంత్రం పూట కట్టెల
సేకరణకు అడవిలోకి వెళ్లి.. వన్యప్రాణులు ప్రత్యేకంగా చిరుత పులుల దాడులకు
గురయ్యేవారు. ఈ పరిస్థితిని మార్చేందుకు అయిదేళ్ల క్రితం అధికారుల మదిలో
మెరిసిన ఉపాయమే ‘మోగ్లీ పాఠశాల’. అటవీశాఖ భవనాల్లో సాయంత్రం పూట వీటిని
నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలకు వచ్చిన చిన్నారులకు రంగురంగుల పుస్తకాలు,
క్రీడా పరికరాలు, కామిక్ పుస్తకాలు ఇస్తారు. కార్టూన్ షోలు చూపిస్తారు. ఓ
రకంగా చెప్పాలంటే.. ట్యూషన్ సెంటర్ల మాదిరిగా ఈ పాఠశాలలు పనిచేస్తాయి. ‘‘ఏటా
ఈ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. చిన్నారులకు ఈ ప్రాంతంలోని
పర్యావరణం గురించి, వివిధ రకాల వన్యప్రాణుల గురించి సైతం బోధిస్తున్నాం. ఈ
పాఠశాలలకు ప్రత్యేకంగా టీచర్లు ఉన్నప్పటికీ అటవీ అధికారులు, పశువైద్య
నిపుణులు, ప్రత్యేక టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, ఇతర ప్రభుత్వ
అధికారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తరగతులు చెబుతున్నారని డివిజనల్ అటవీ
అధికారి అకాశ్‌దీప్ బధ్వాన్ చెప్పారు.