టెలివిజన్, కంప్యూటర్ గేమ్‌లపై మక్కువ బాగా తగ్గింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి
తర్వాత ఆన్లైన్ క్లాసుల జోరు పెరిగింది. దీంతో యువత స్మార్ట్ ఫోన్ వాడే సమయం
కూడా విపరీతంగా పెరిగింది. అలాగే స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చూస్తూ ఎక్కువ సమయం
గడుపుతున్నారు. కొన్నిసార్లు పేలవమైన భంగిమతో వెన్నునొప్పితో బాధపడుతున్నారు.
అంతేకాకుండా ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా స్మార్ట్ ఫోన్ వాడకం కారణమవుతుంది.
బ్రెజిలియన్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల
వెన్నెముక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడైంది. ముఖ్యంగా రోజుకు
మూడు గంటల కంటే ఎక్కువసేపు స్క్రీన్లను చూడటం లేదా స్క్రీన్కు దగ్గరగా ఉండటం
లేదా మంచి భంగిమ కూర్చోకపోవడం వల్ల వెన్నెముక సమస్యలు వస్తాయని తేలింది. అయితే
ఈ అధ్యయనంలో తేలిన ముఖ్యమైన విషయాలపై ఓ లుక్కేద్దాం.బ్రెజిల్లో చేసిన
అధ్యయనంలో ముఖ్యంగా థొరాసిక్ వెన్నెముక నొప్పి (టీఎస్పీ) పై దృష్టి పెట్టారు.
థొరాసిక్ వెన్నెముక ఛాతీ వెనుక భాగంలో (థొరాక్స్), ఎక్కువగా భుజం బ్లేడ్ల
మధ్య ఉంటుంది, మెడ దిగువ నుంచి నడుము వెన్నెముక ప్రారంభం వరకు విస్తరించి
ఉంటుంది.
దాదాపు 14 నుంచి 18 సంవత్సరాల వయస్సు ఉన్న మగ, ఆడ విద్యార్థుల సర్వేల
నుంచి ఈ విషయం కనుగొన్నారు. ముఖ్యంగా ఈ సర్వేలో 1,628 మంది పాల్గొన్నారు.
అధికంగా ఫోన్ వినియోగం వల్ల ఎక్కువ మంది టీెఎస్పీతో బాధపడుతున్నారని తేలింది.
మగవారితో పోలిస్తే ఆడవాళ్లు ఎక్కువగా టీఎస్పీతో బాధపడుతున్నారు. దాదాపు ఈ
సర్వే 10 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని తేలింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో చాలా మంది టీఎస్పీతో బాధపడుతున్నారు. కౌమారదశలో
ఉన్నవారిలో 13 శాతం-35 శాతం వరకు ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎక్కువసేపు
స్మార్ట్ ఫోన్ వినియోగించకుండా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు తల్లిదండ్రులకు
సూచిస్తున్నారు