మంత్రి హరీశ్‌రావు ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ప్రధానమంత్రి తన వల్లే
తెలంగాణలో అభివృద్ధి చెందుతున్నట్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. నరేంద్ర
మోడీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు, సత్య దూరాలు అని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన
చేయడానికి వచ్చినట్లు లేదని, తెలంగాణపై తన కడుపులోని విషాన్ని కక్కడానికి
వచ్చినట్లు ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ట్విటర్ వేదికగా
ఆరోపణలు చేశారు. సికింద్రాబాద్ సభలో ప్రధాని చెప్పిన ప్రతి మాట సత్య దూరంగానే
ఉందని, అన్ని అబద్ధాలు ఆడటం ఆయనకే చెల్లిందని ధ్వజమెత్తారు. రాష్ట్రం
ఏర్పడినప్పటి నుంచి ఆసరా పింఛన్, రైతు బంధు వంటివి నేరుగా లబ్ధిదారుల
ఖాతాల్లోకే జమ అవుతున్నాయని మంత్రి ట్వీట్ చేశారు.
ప్రధానమంత్రి తన వల్లే డీబీటీ మొదలైనట్లు చెప్పడం పచ్చి అబద్ధమని, అందులో
గొప్పగా చెప్పుకోవడానికి ఏముందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రైతు బంధు
పథకాన్ని కాపీ కొడితేనే పీఎం కిసాన్ అయ్యిందని మంత్రి గుర్తు చేశారు. పీఎం
కిసాన్ వల్లే మొదటి సారి రైతులకు లబ్ది జరుగుతుందని ప్రధాని స్థానంలో ఉన్న
వ్యక్తి చెప్పడం సిగ్గు చేటన్నారు. రైతుబంధుతో పోల్చితే పీఎం కిసాన్ ద్వారా
ఎంత సాయం అందుతుందో చెప్పాలని నరేంద్ర మోదీని సూటిగా ప్రశ్నించారు.
రాష్ట్రానికి ఏ విధంగా సాయం చేశారు. మోడీ గారు?
ప్రధానమంత్రి ప్రసంగంలో వ్యవసాయానికి, పరిశ్రమలకు చేయూత అని చెప్పడం పూర్తిగా
అవాస్తవమని మంత్రి అన్నారు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రానికి
రావాల్సిన ఐటీఐఆర్ సంస్థను బెంగళూరుకు తరలించిందని విమర్శించారు. రాష్ట్ర
ప్రభుత్వం ఆర్బిట్రేషన్ సెంటర్‌ను నెలకొల్పిందని తెలిసిన వెంటనే కేంద్రం
గుజరాత్లో సైతం ఆ సెంటర్‌ను ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ ధాన్యాలను
కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి
దుర్మార్గపు పనులు చేసింది.. మీ ప్రభుత్వం కాదా మోడీ గారు అని హరీశ్‌రావు
ప్రశ్నించారు.అదానీ వాదం గురించి ప్రజల దృష్టి మళ్లించడానికేనని, లేని పరివార
వాదం గురించి మాట్లాడటం మీకే చెల్లిందని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర
ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందించడం లేదని.. దేశానికి ప్రధానిగా ఉన్న
వ్యక్తినే చెప్పడం హాస్యాస్పదమని, నిజానికి ఈ పరిస్థితి పూర్తిగా రివర్స్ అని
ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రావాల్సిన గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్
ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు,
జాతీయ హోదా వంటివి ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపించిందని ఆవేదన
చెందారు. కేంద్రం ఏ విషయంలోనూ రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందించలేదని
హరీశ్‌రావు మండిపడ్డారు.