కుటుంబ పాలన కారణంగా అవినీతి పెరుగుతోంది
అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావడం లేదు
తెలంగాణ అభివృద్ధి కోసం మమ్మల్ని ఆశీర్వదించాలి
పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ
హైదరాబాద్ : కుటుంబ పాలన నుంచి ఈ ప్రజలకు విముక్తి కలిగిస్తామని ప్రధాని
నరేంద్ర మోడీ వెల్లడించారు. నిజాయితీతో పనిచేసే వారంటే అవినీతిపరులకు భయమని,
అభివృద్ధి పనుల్లో కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం కలిసి రావడం లేదని
వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందేభారత్ రైలును
అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భాగ్యలక్ష్మి నగరాన్ని వేంకటేశ్వరస్వామి
నగరంతో కలిపామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సికింద్రాబాద్ రైల్వే
స్టేషన్లో సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందేభారత్ రైలును ప్రారంభించిన
అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ
ప్రసంగించారు.
ప్రియమైన సోదర, సోదరీమణులారా.అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టారు.
‘‘కరోనా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచం తిరోగమనంలోకి వెళ్లింది. భారత్
మాత్రం ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. బడ్జెట్లో ఈ ఏడాది మౌలిక వసతుల
కల్పన కోసం రూ.10 లక్షల కోట్లు కేటాయించాం. రాష్ట్రంలో రూ.35 వేల కోట్లతో
జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాం. జాతీయ రహదారుల విస్తరణకు భారీగా నిధులు
కేటాయించాం. రాష్ట్రంలో భారీ టెక్స్టైల్ పార్క్ నిర్మించుకున్నాం.
టెక్స్టైల్ పార్క్‌తో రైతులు, కార్మికులకు ఎంతో ఉపయోగం. తొమ్మిదేళ్లలో
భారత్ రూపురేఖలు సమూలంగా మార్చాం. దేశ అభివృద్ధిలో తెలంగాణ భాగమయ్యేలా చేశాం.
రూ. 11 వేల కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామని నరేంద్ర మోడీ
పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావడం లేదు : ‘‘హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ సేవలు
విస్తరిస్తున్నాం. ఒక్కరోజే 13 ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చాం.
సికింద్రాబాద్ – మహబూబ్‌నగర్ రైల్వే డబ్లింగ్ పనులు పూర్తి చేశాం.
తెలంగాణలో హైవే నెట్‌వర్క్‌ను వేగంగా అభివృద్ధి చేస్తున్నాం. హైదరాబాద్ –
బెంగళూరు అనుసంధానాన్ని మెరుగుపరుస్తున్నాం. తెలంగాణలో జాతీయ రహదారుల
విస్తీర్ణాన్ని భారీగా పెంచుతున్నాం. తెలంగాణలో అభివృద్ధి పనుల
ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావడం లేదు. కేంద్రం ప్రగతి పనులు
చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం బాధపడుతోంది. తెలంగాణలో 12 లక్షల మందికి ఉజ్వల
గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. తెలంగాణ అభివృద్ధి కోసం మమ్మల్ని ఆశీర్వదించాలి.
కుటుంబ పాలన కారణంగా అవినీతి పెరుగుతోంది : రాష్ట్రంలో కుటుంబ పాలన, అవినీతి
రాజ్యమేలుతున్నాయి. తండ్రి, కొడుకు, కుమార్తె అంతా అధికారంలో ఉంటారు. కుటుంబ
పాలన కారణంగా అవినీతి పెరుగుతోంది.కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు కాదు. కొంత
మంది ప్రగతి నిరోధకులుగా మారారు. ప్రజల సొమ్ము అవినీతిపరులకు చేరకుండా చర్యలు
తీసుకుంటున్నాం. నేరుగా రైతులు, విద్యార్థుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నాం.
డిజిటల్ విధానం ద్వారా దళారీ విధానం లేకుండా చేశాం. నిజాయితీతో పనిచేసే
వారంటే అవినీతిపరులకు భయం. అభివృద్ధి పనుల్లో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం
కలిసి రావడం లేదు. దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయాలా వద్దా? అవినీతిపై
పోరాటం చేయాలా? వద్దా? అవినీతిపరుల విషయంలో చట్టం తనపని తాను చేసుకోవాలా?
వద్దా?.. కుటుంబ పాలన నుంచి ఈ ప్రజలకు విముక్తి కలిగిస్తామని ప్రధాని నరేంద్ర
మోడీ వెల్లడించారు.