హైదరాబాద్ : ప్రతి కుటుంబం వెంకటేశ్వరస్వామి దర్శనం కోరుకుంటుందని, శ్రీవారి
భక్తుల కోసమే వందేభారత్ రైలు ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారని కేంద్ర
మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు
చేసిన సభలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర
మోదీ శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్-తిరుపతి మధ్య
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారన్నారు. దేశంలో 14వ వందేభారత్
రైలును ప్రారంభించుకున్నామన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి
జరుగుతోందన్నారు. రూ.7864 కోట్లతో జాతీయ రహదారుల పనులకు ప్రధాని మోదీ శ్రీకారం
చుట్టారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 32 జిల్లాలను జాతీయ
రహదారులతో అనుసంధానం జరుగుతోందని, ఎలాంటి భేదభావాలు లేకుండా ప్రధాని అభివృద్ధి
చేస్తున్నారన్నారు. రూ.1,350 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్‌లో కొత్త భవనం నిర్మాణం
చేస్తున్నామని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేది ప్రధాని మోదీ
సంకల్పమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ
రూ.11,300 కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో
రూ.720 కోట్లతో అభివృద్ధి పనులు,వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు, జంటనగరాల్లో
13 ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించారు. అలాగే సికింద్రాబాద్ పరేడ్
గ్రౌండ్స్‌లో వేదికపై నుంచే పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం
చుట్టారు. రిమోట్ ద్వారా శిలాఫలకాలను ఆవిష్కరించారు. రూ.1,350 కోట్లతో
బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణానికి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. రూ.7,850
కోట్లతో చేపట్టనున్న జాతీయ రహదారుల పనులు, ఐదు జాతీయ రహదారులకు ప్రధాని
నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. మరి కాసేపట్లో ప్రజలను ఉద్దేశించి ఆయన
ప్రసంగించనున్నారు.