గంజాయి వద్దు బ్రో అంటూ టీ షర్ట్స్, క్యాప్‌లు ధరించిన బాలకృష్ణ, లోకేష్
అనంతపురం : శింగనమల నియోజకవర్గంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది.
లోకేశ్ యాత్రలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ యువగళం పాదయాత్రకు సంఘీభావం
తెలిపారు. గంజాయి వద్దు బ్రో అంటూ రాసి ఉన్న క్యాప్, టీ షర్టులను లోకేశ్,
బాలకృష్ణ పాదయాత్రలో ధరించి యువత డ్రగ్స్‌కి దూరంగా ఉండాలి అంటూ మెసేజ్
ఇస్తున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ గంజాయి ఏపీకి కేర్ ఆఫ్ అడ్రస్‌గా
మారింది. గత 63 రోజులుగా డ్రగ్స్ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా.
సీఎం జగన్ పాలనలో ఏపీ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారింది. ఆఖరికి
తిరుమలని కూడా వైసీపీ గంజాయి మాఫియా వదలడం లేదు. చివరకు తిరుమలలో కూడా గంజాయి
అమ్ముతున్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. గంజాయి
వలన యువత భవిష్యత్తు నాశనం అవుతుంది. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురి
అవుతున్నారు. టీడీపీ హయాంలో రూ. 40వేల కోట్లు విలువ చేసే గంజాయిని తగలబెడితే
ఇప్పుడు ఏకంగా వైసీపీ నాయకులు గంజాయి పంట వేస్తున్నారు. పాదయాత్రలో ఉండగా
చంద్రగిరిలో ఒక తల్లి వచ్చి తన కుమార్తె గంజాయికి బానిస అయ్యిందని ఆవేదన
వ్యక్తం చేసింది. ఆ తల్లి చెప్పిన మాటలు నన్ను కలచివేశాయి. అందుకే గంజాయికి
వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాం. టీడీపీ
హయాంలో పెట్టిన డీఎడిక్షన్ సెంటర్లు కూడా వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేశారు.
యువత అంతా డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలి అని పిలుపు ఇస్తున్నా. టీడీపీ
ప్రభుత్వం వచ్చిన వెంటనే వైసీపీ గంజాయి మాఫియాపై చర్యలు తీసుకుంటాం. గంజాయి
వద్దు బ్రో. యువత గంజాయికి దూరంగా ఉండాలి అంటూ’’ లోకేష్ పిలుపునిచ్చారు.