ఈనెల 7 నుంచి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం
గత ప్రభుత్వాలకు, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ప్రజలకు చెబుతాం
వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట : రానున్న ఎన్నికల్లో కూడా మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్నని
గెలిపించుకోవడం మనందరి భాధ్యత అని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన
కృష్ణదాస్ అన్నారు. బుధవారం నరసన్నపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల
సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
పార్టీ తరఫున సచివాలయ కన్వీనర్లతో పాటు, గృహసారథులు తొలిసారి ఒక భారీ పార్టీ
కార్యక్రమంతో ఈనెల 7 నుంచి 14 రోజుల పాటు ప్రజలతో మమేకం కావడానికి ప్రత్యేక
కార్యక్రమానికి రూపకల్పన చేస్తామన్నారు. ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగానే
కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి.. వాటిని తీర్చే బాధ్యతగల పౌరులుగా పని
చేస్తారని తెలిపారు. ప్రభుత్వం పనితీరుపై పార్టీ పట్ల ప్రజల అభిప్రాయాన్ని,
సంతృప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటారన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రధానమైన
నినాదం ‘మా నమ్మకం నువ్వే జగన్’. అందుకే ఈ నినాదాన్ని కూడా ‘జగనన్నే మా
భవిష్యత్తు’ కార్యక్రమంలో ఒక ప్రధాన అంశంగా పెట్టామన్నారు. ఈ నినాదమనేది తమకు
తాముగా అనుకున్నది కాదన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకొచ్చాక ప్రజలకు ఏ విధంగా
పరిపాలన అందిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారన్నారు. గత ప్రభుత్వాల ఆలోచనలకు
భిన్నంగా.. ప్రజలకు జవాబు దారీతనంగా ఉండే లక్షణం రాజకీయ పార్టీలకు ఉండాలని,
అలాగే ప్రజలతో మమేకమై ప్రజల అవసరాలకు, అంచనాలకు అనుగుణంగా పాలన సాగించాలని,
ప్రజల జీవితాల్లో, వారి జీవనశైలిలో వచ్చిన మార్పును కళ్లకు కట్టినట్టు
చూపించడమే తమ లక్ష్యం అని తెలిపారు. సచివాలయాల ద్వారా వాలంటీర్లు
క్షేత్రస్థాయి నుంచి తీసుకొస్తున్న సర్వేల ద్వారా పరిశీలిస్తే.. దాదాపు 80
నుంచి 90 శాతం వరకు సమాజంలో ఒక రియల్ ఛేంజ్ (గుణాత్మకమైన మార్పు)
కనిపిస్తుందని నిరూపితమైందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఏదైతే
నమ్మకం పెట్టుకున్నామో దాన్ని ఒకటికి రెండింతలు నిలబెట్టుకున్నారనీ అందుకనే
జగన్మోహన్రెడ్డిని తామంతా నమ్ముతున్నామని ఈ రోజు ప్రజలు చెబుతున్నారన్నారు.
ప్రతిపక్షాలు వికృతచేష్టలతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంక్షేమ రథానికి
అడ్డంపడే ప్రయత్నాలు, కుట్రలు చేస్తున్న దుష్టశక్తులకు ఈ కార్యక్రమం తగిన
గుణపాఠం చెబుతుందని కృష్ణదాస్ అన్నారు. ఎన్ని పక్షాలు ఏకమైనా ఒనగూరేదేమీ
లేదన్నారు. ఈ సందర్భంగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి సంబంధించి
గోడపత్రికను ఆవిష్కరించారు. తొలుత బాబూ జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన
చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీలు ఆరంగి మురళి, వాన
గోపి, ప్రతినిధి ముద్దాడ బైరాగినాయుడు, జడ్పిటిసిలు వరుదు నాగేశ్వరమ్మ, చింతు
అన్నపూర్ణ రామారావు, జేసిఎస్ మండల కన్వీనర్లు నక్క తులసీదాస్, సురంగి
నరసింగరావు, కణతి సత్తిబాబు, ధర్మాన జగన్, పలు కార్పొరేషన్ చైర్మన్లు కోరాడ
ఆశాలత గుప్త, చీపురు రాణి కృష్ణమూర్తి, రాజాపు అప్పన్న హైమావతి, పాగొటి
రాజారావు, సర్పంచ్ బురెళ్ళ శంకర్, సాసుపల్లి కృష్ణబాబు, గెళ్ళంకి వెంకట్రావు,
పొట్నురు సాయి ప్రసాద్, సదాశివుని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.