విజయవాడ : ఆడపడుచుల ఆర్థిక స్వావలంబనే కుటుంబ ప్రగతికి తొలి మెట్టు అని
ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
60, 61 డివిజన్లకు సంబంధించి వాంబేకాలనీ హెచ్ బ్లాక్ నందు జరిగిన వైఎస్సార్
ఆసరా మూడో విడత సంబరాలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్
సీపీ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తొలుత దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన
నివాళులర్పించారు. ఆడపడుచులతో కలిసి సీఎం జగనన్న చిత్రపటానికి క్షీరాభిషేకం
నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు జగనన్న ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని,
వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా శక్తివంచన లేకుండా కృషి
చేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. మహిళా సాధికారత కోసం బడ్జెట్లో వేల
కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని
చెప్పారు. పేద మహిళలు ఆర్థికంగా బలపడేందుకు, స్వయం సమృద్ధి సాధించేందుకు
ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలుగుదేశం హయాంలో
మేనిఫెస్టో అమలు దేవుడెరుగు.. తొలి ఐదు సంతకాల అమలుకే దిక్కు లేకుండా పోయిందని
విమర్శించారు. కానీ వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి
అక్కచెల్లెమ్మలకు నాలుగు విడతలుగా వడ్డీతో సహా బకాయిలన్నీ చెల్లిస్తున్నారని
చెప్పారు. ఇప్పటికి మూడు విడతలలో రూ.19,178.17 కోట్లు విడుదల చేశారని మల్లాది
విష్ణు వెల్లడించారు. 60 డివిజన్ కు సంబంధించి మూడవ విడత ఆసరా ద్వారా 190
గ్రూపులలోని 1,844 మంది అక్కచెల్లెమ్మల ఖాతాలలో రూ. కోటి 58 లక్షల 71 వేల 592
నిధులు జమ చేసినట్లు తెలిపారు. అలాగే 61 డివిజన్లో 138 గ్రూపులలోని 1,373 మంది
ఆడపడుచులకు రూ. కోటి 25 లక్షల 42 వేల 20 అందజేసినట్లు వివరించారు. ఇచ్చిన
మాటను నిలబెట్టుకోవడంలో చంద్రబాబుకు, సీఎం జగనన్న మధ్య వ్యత్యాసాన్ని
గమనించాలని ఆడపడుచులను కోరారు.
వాంబేకాలనీతో విడదీయరాని బంధం
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పిన ఒక్క మాటతో ఆనాడు వాంబే కాలనీలో
1,056 మంది పేదలు గృహ యజమానులుగా మారారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు
గుర్తుచేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం 105 మంది పేదల నుంచి రూ. 60 వేలు
చెల్లించుకుని పట్టాలను పంపిణీ చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. నాలుగు
సార్లు ఫైల్ పంపించినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కన పడేశారన్నారు. కానీ
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏళ్ల తరబడి పరిష్కారంకాని
హెచ్ బ్లాక్ కాలనీవాసుల సమస్యకు ఓటీఎస్ ద్వారా పరిష్కారం చూపారని మల్లాది
విష్ణు తెలిపారు. మొత్తంగా 529 మందికి దస్తావేజులు పంపిణీ చేసినట్లు
తెలియజేశారు. చేతులు మారిన ఇళ్లకు సైతం హక్కుతో కూడిన ఇళ్లపత్రాలు అందజేయడం
జరుగుతోందని మల్లాది విష్ణు తెలిపారు. అలాగే ఈ ప్రాంతంలో ఇళ్ల రిజిస్ట్రేషన్ల
సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో ప్రజలందరూ హర్షాతిరేకాలు వ్యక్తం
చేస్తున్నారన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం వాంబేకాలనీలో
3,500 మంది పేదలకు నామమాత్రపు రుసుము గజానికి కేవలం రూ. 100 కే రిజిస్ట్రేషన్
చేసుకునే వెసులుబాటు కలిగిందన్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం
ఏర్పాటు అయిన మూడున్నరేళ్లలో 60 వ డివిజన్లో రూ. 10 కోట్ల అభివృద్ధి పనులు
చేపట్టగా 61వ డివిజన్లో రూ. 15 కోట్ల పనులు చేపట్టినట్లు తెలియజేశారు. కనుక
మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలవాలని అక్కచెల్లెమ్మలను విజ్ఞప్తి
చేశారు.
నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఐదేళ్లు
అధికారంలో ఉన్నప్పటికీ డ్వాక్రా సంఘాల బకాయిలు చెల్లించకుండా, కేవలం ఎన్నికల
ముందు పసుపు-కుంకుమ పథకం పేరుతో తూతూమంత్రంగా చెల్లింపులు చేసిందన్నారు.
చంద్రబాబు మోసాన్ని గుర్తించిన అక్కచెల్లెమ్మలు 2019 ఎన్నికల్లో టీడీపీకి సరైన
బుద్ధి చెప్పారన్నారు. కార్యక్రమంలో సీడీఓ జగదీశ్వరి, కోఆప్షన్ సభ్యులు నందెపు
జగదీష్, నాయకులు బెవర నారాయణ, బత్తుల దుర్గారావు, నాళం బాబు, ఆర్.ఎస్.నాయుడు,
కోటేశ్వరరావు, ఫాతిమా, మీసాల బాలనాగమ్మ, పొదుపు సంఘాల మహిళలు పెద్దసంఖ్యలో
పాల్గొన్నారు.