సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత
వికలాంగులకు, వృద్ధులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ
విశాఖపట్నం : ఈనెల 23వ తేదీన జరుగు సింహాచల అప్పన్న నిజరూప దర్శనం చందనోత్సవ
యాత్రకు పకడ్బందీగా ఏర్పాట్లు గావించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , దేవాదాయ
శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ
మందిరంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, దేవాదాయ శాఖ కమీషనర్
, జిల్లా కలెక్టర్ , పోలీస్ కమీషనర్, ఎమ్మెల్యేలతో కలిసి సంబంధిత శాఖల
అధికారులతో చందనోత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా
దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఈనెల 23వ తేదీ తెల్లవారు
జామున మూడు గంటలకు సింహాచల చందనోత్సవ మొదటి దర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు.
భక్తులందరికీ సంతృప్తిగా దర్శనం కలిగేలా ఏర్పాటు చేయాలని అధికారులు
ఆదేశించారు. వేలాది సంఖ్యలో భక్తులు సింహగిరికి రానున్నారని, ఈ నేపథ్యంలో
సామాన్య భక్తులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను
ఆదేశించారు.
భక్తులందరికీ సరిపడేలా ప్రసాదాలు తయారు చేయాలని పేర్కొన్నారు. సిబ్బందికి
కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని అన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం
కలుగకుండా రవాణా, పారిశుధ్యం , టాయిలెట్లు , మంచినీటి సరఫరా , మెడికల్ తదితర
ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వికలాంగులకు, వృద్ధులకు ప్రత్యేక దర్శనం ,
వాహనాలు , లిఫ్ట్ సౌకర్యం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ వీలైనంత ఎక్కువ
మందికి దర్శన భాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.
భక్తులకు 24 గంటలు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని అన్నారు. విధులలో పాల్గొను
సంబంధిత శాఖల అధికారులు పూర్తిస్థాయిలో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం
చేయాలని తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ
అధికారులందరూ ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని అన్నారు. టిక్కెట్ల
విక్రయం, దర్శన సౌకర్యం కొరకు ప్రత్యేక సాప్ట్ వేర్ రూపొందించినట్లు తెలిపారు.
భక్తులు , అధికారులుకోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని
పేర్కొన్నారు. భక్తులకు వెను వెంటనే సమాచారం అందించేలా సమాచార కేంద్రాలు
ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున మాట్లాడుతూ
చందనోత్సవం జరుగు రోజున మాంసం దుకాణాలు , మద్యపాన దుకాణాలు మూసివేయడం జరుగునని
తెలిపారు. భక్తులు క్యూ లైన్లలో క్రమ పద్దతిని పాటించి సహకరంచవలసినదిగా
కోరారు. భక్తులకు ఉచిత దర్శనం తో పాటు , రూ.300, రూ.1000, రూ. 1500 టిక్కెట్ల
విక్రయం జరుగునని తెలిపారు. కార్యక్రమ ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ద్వారా మంత్రికి వివరించారు. పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ
భక్తులకు అసౌకర్యం కలగకుండా స్లాట్ సిస్టం ద్వారా దర్శనం కల్పించబడునని
తెలిపారు. త్వరతగతిన దర్శనానికి పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు
చేస్తున్నట్లు తెలిపారు. ప్రముఖులు అందరూ సహకరించాలని కోరారు. అనంతరం పై
ఏర్పాట్లపై పత్రికా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్
గొలగాని హరి వెంకట కుమారి, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల
నాగిరెడ్డి, డీసీపీ సుమిత్ సునీల్ గరుడ్ , ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల
శ్రీనుబాబు , ఇతర మండలి సభ్యులు , దేవాదాయ శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీస్,
ఆర్టీసి, వైద్య ఆరోగ్య, ఫైర్, జీవీఎంసీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.