అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీ లను వెంటనే భర్తీ
చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు
బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు. ఆరు సంవత్సరాలు గా
నోటిఫికేషన్ లేదని, అసలు నోటిఫికేషన్ విడుదల చేస్తారో లేదో తెలియని అయోమయం
లోకి యువత ను నెట్టి వేయొద్దని హితవు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న
పాలిటెక్నిక్ కళాశాలల్లో సుమారు 854 పోస్టు లు ఖాళీలు ఉన్నాయని,
పాలిటెక్నిక్ కళాశాలల్లో పోస్ట్ లు ఎప్పుడు భర్తీ చేస్తారనే విషయం ప్రభుత్వం
స్పష్టం చేయకుండా కాలయాపన చేయడం తగదన్నారు. ఎపి ఉద్యోగ పోరాట సమితి ప్రభుత్వం
దృష్టికి తీసుకు వచ్చినా ఎందుకు కాలయాపన చేస్తున్నారని సోము వీర్రాజు
ప్రశ్నించారు. పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని
డిమాండ్ చేసారు. నిరుద్యోగులను మభ్య పెట్టే పనులు మానుకోవాలని హితవు పలికారు.
రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య అభ్యసించిన యువత కు ఉద్యోగం అవకాశాలు
కల్పించకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం మానుకోవాలన్నారు. ఉద్యోగ అవకాశాలు కోసం
ఎదురు చూస్తున్న యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న తపన ప్రభుత్వానికి ఉందా
అని సోము వీర్రాజు ప్రశ్నించారు.