న్యూఢిల్లీ : కేరళ, త్రిపుర, పశ్చిమబెంగాల్లో వామపక్ష ప్రభుత్వాల పాలనలో
పట్టణ ఉపాధి హామీ పథకాలు అమలు చేశాయని, అందుకు చట్టాలు కూడా చేశాయని కేంద్ర
పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి కౌషల్ కిశోర్ తెలిపారు. రాజ్యసభలో సిపిఎం ఎంపి
వి శివదాసన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
కేరళలో అయ్యంకాలి పట్టణ ఉపాధి హామీ కార్యక్రమం 2010 నుంచి అమలవుతుందని,
త్రిపురలో త్రిపుర పట్టణ ఉపాధి కార్యక్రమం 2009 నుంచి అమలవుతుందని, పశ్చిమ
బెంగాల్లో పశ్చిమ బెంగాల్ పట్టణ ఉపాధి హామీ పథకం 2010 నుంచి అమలవుతుందని
తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో పట్టణ ఉపాధి హామీ పథకాలు తీసుకొచ్చినప్పుడు కేరళలో
విఎస్ అచ్యుతానందన్ ప్రభుత్వం, త్రిపురలో మాణిక్ సర్కార్ ప్రభుత్వం,
పశ్చిమ బెంగాల్లో బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం అధికారంలో ఉన్నాయాన్నారు.
ఈ మూడు రాష్ట్రాలతో పాటు ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో
2020 నుంచి అమలవుతుందని, రాజస్థాన్‌లో 2022-23 బడ్జెట్లో ప్రకటించారని
తెలిపారు. పట్టణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం ఎటువంటి పథకాలు
రూపొందించలేదని, పట్టణ ఉపాధి హామీ పథకానిు అమలు చేస్తున్న రాష్ట్రాలకు కేంద్రం
ఎటువంటి ఆర్థిక సాయం చేయలేదని చెప్పారు.
ఎపిలో మూడు విమానాశ్రయాల ప్రైవేటీకరణ
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలను
ప్రైవేటీకరించనునుట్లు పౌర విమానయానశాఖ సహాయ మంత్రి జనరల్ వికె సింగ్
(రిటైర్డ్) తెలిపారు.రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
దేశవ్యాప్తంగా మొత్తం 25 విమానాశ్రయాలను లీజుకు ఇవ్వడం ద్వారా 2025 నాటికి
రూ.10,782 కోట్లు ఆదాయం వస్తుందనిఅంచనా వేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
విమానాశ్రయాల ప్రైవేటీకరణ అంశం విమానాల రాకపోకలు, మార్కెట్ పరిస్థితులు,
పెట్టుబడిదారుల ఆసక్తి, లావాదేవీల నిబంధనలపై ఆధారపడి ఉంటుందని మంత్రి
వెల్లడించారు.
‘నమామి గోదావరి’ ప్రాజెక్టు ప్రతిపాదన లేదు
గంగా నది ప్రక్షాళనకు ఉద్దేశించిన ‘నమామి గంగ’ ప్రాజెక్టు మాదిరిగా గోదావరి
ప్రక్షాళనకు ‘నమామి గోదావరి’ ప్రాజెక్టు చేపట్టే ప్రతిపాదన లేదనిజలశక్తి సహాయ
మంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి అడిగిన
ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.