దక్షిణ కొరియా, ఉత్తర కొరియా సరిహద్దులకు సమీపంలో విన్యాసాలు
అణుదాడి జరిగితే తిప్పికొట్టేందుకు సన్నద్ధమవ్వాలన్న కిమ్
అమెరికా, దక్షిణ కొరియా 11 రోజుల పాటు సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టడం పట్ల
ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ మండిపడుతున్నారు. అది కూడా తమ
సరిహద్దులకు చేరువలో ఈ విన్యాసాలు జరపడంతో కిమ్ భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో,
అణుదాడికి సన్నద్ధమవ్వాలంటూ సైన్యానికి పిలుపునిచ్చారు. తమపై అణుదాడి జరిగితే
తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. తద్వారా, అమెరికా, దక్షిణ
కొరియాలకు తీవ్ర హెచ్చరికలు పంపించారు. ఇటీవల ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలను
తీవ్రతరం చేసింది. ఆదివారం కూడా ఓ ఖండాంతర క్షిపణిని ప్రయోగించి అమెరికా,
దక్షిణ కొరియాలకు స్పష్టమైన సంకేతాలు పంపింది. ఈ క్షిపణి 800 కిమీ ప్రయాణించి,
800 కిమీ ఎత్తులోని లక్ష్యాన్ని ఛేదించడంతో కిమ్ హర్షం వ్యక్తం చేసినట్టు
ఉత్తర కొరియా అధికారిక మీడియా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది. ఇటీవల ఉత్తర
కొరియా ఒకే రోజున 4 క్షిపణులను పరీక్షించడం తెలిసిందే.